కరీమాబాద్, ఆగస్టు 26: ప్రధాన రహదారులపై అతివేగంగా వెళ్లారో.. ఇక మీరు మీ ఇంటికి చేరుకునేలోపే ఈ-చలానా వస్తుంది. అజాగ్రత్త, అతివేగంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మామునూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మామునూరు సీఐ రమేశ్ ఆధ్వర్యంలో నిత్యం వాహన తనిఖీలు చేపడుతూనే వాహనదారులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశారు.
అతి వేగానికి అడ్డుకట్ట
పున్నేల్ క్రాస్ నుంచి నాయుడు పంపు జంక్షన్ వరకు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు ఈ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలో బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులను సూచించిన వేగం కన్నా ఎక్కువగా వెళ్లే వాహనాలకు స్పీడ్గన్స్ ద్వారా ఫొటోలు తీసి ఈ-చలాన్లు వేస్తున్నారు. 14 కిలో మీటర్ల పరిధిలో దాదాపు నాలుగు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు రోడ్డుపై స్టడ్స్, డ్రమ్ములు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రిస్తూ ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తున్నారు.
ప్రజలు సహకరించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పీడ్గన్స్ ఏర్పాటు చేశాం. వాహనదారుకుల అవగాహన కలిగేలా వేగం సూచించే బోర్డులు ఏర్పాటు చేశాం. పున్నేల్ క్రాస్ నుంచి నాయుడు పంపు జంక్షన్ వరకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాం.