వరంగల్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరెలను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. శనివారం నుంచి చీరెల పంపిణీ జరుగనుంది. ఇందుకోసం బతుకమ్మ చీరెలు శుక్రవారం గ్రామ పంచాయతీలు, వార్డులు, డివిజన్లకు చేరనున్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సమయంలో మహిళలకు సారె కింద ఉచితంగా చీరెలను పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది కూడా అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఏటా ఈ పండుగ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే మహిళలకు సారె అందజేస్తున్నది. మహిళల కోసం బతుకమ్మ చీరెల తయారీకి ఈ ఏడాది ప్రభుత్వం రూ.318 కోట్లు వెచ్చించింది. దాదాపు పదహారు వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు శ్రమించి బతుకమ్మ చీరెలను తయారు చేశాయి. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశాలతో ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెలను రూపొందించారు. డాబీ అంచు ఈసారి మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. బతుకమ్మ చీరెల ప్యాకింగ్నూ ఆకర్షణీయంగా చేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ చీరెలు జిల్లాలకు చేరాయి. తొమ్మిది, ఆరు మీటర్ల సైజు గల బతుకమ్మ చీరెలను మహిళలు ఉచితంగా అందుకోనున్నారు.
ఏర్పాట్లు చేసిన అధికారులు
జిల్లాలో పదమూడు మండలాలు ఉన్నాయి. వీటిలో ఉన్న పద్దెనిమిదేళ్ల వయసుపైబడిన మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనుంది. ఈ మేరకు జిల్లాకు 3,37,334 చీరెలను కేటాయించింది. వరంగల్ మండలానికి 65,534, ఖిలావరంగల్ మండలానికి 61,519 చీరెలను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. నర్సంపేటకు 28,028, గీసుగొండకు 22,682, రాయపర్తికి 21,636, నెక్కొండకు 20,578, వర్దన్నపేటకు 18,875, సంగెం 18,345, పర్వతగిరికి 18,682, దుగ్గొండికి 17,841, చెన్నారావుపేటకు 15,972, నల్లబెల్లికి 14,742, ఖానాపురం 12,502 చీరెలను కేటాయించింది. వీటిలో ఇప్పటికే 1.97 లక్షల బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరాయి. వీటిని నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో అధికారులు భద్రపరిచారు. ఈ గోదాం నుంచి శుక్రవారం జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని వార్డులు, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని డివిజన్లకు నేరుగా బతుకమ్మ చీరెలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలో రేషన్ డీలర్లు, పురపాలిక బిల్ కలెక్టర్లు, మహిళా సంఘా ప్రతినిధుల సమక్షంలో మహిళలకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుల ద్వారా మహిళలు ఈ బతుకమ్మ చీరెలను పొందుతారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఎమ్మెల్యేలు కూడా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.