వరంగల్/కాశీబుగ/హసన్‌పర్తి, ఆగస్టు 31: వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్‌లోని భీమారం, కాశీబుగ్గ, ఎనుమాముల మధురానగర్, లక్ష్మీగణపతినగర్లో మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో కాలనీల్లోకి చేరిన వరద నీటిని మళ్లించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీగణపతి నగర్లో వరదనీరు చెరువుల్లోకి వెళ్లేలా కల్వర్టులను నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా బాలాజీనగర్ జంక్షన్ నుంచి రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారని, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు. వర్షపు నీటిని మళ్లించేందకు ఎలాంటి మార్గాలు లేకపోవడంలో అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఆమె అన్నారు. 55వ డివిజన్లో పర్యటించిన మేయర్ భీమారం మత్తడి నీరు కాలనీల్లోకి రాకుండా శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రజితావెంటేశ్వర్లు, తూర్పాటి సులోచనాసారయ్య, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈ రవికుమార్, ఏఈలు కృష్ణమూర్తి, కార్తిక్‌రెడ్డి, అజ్మీరా శ్రీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య పాల్గొన్నారు.
ముంపు బాధితులకు భోజనాలు
వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాలకు రెండో రోజు భోజన వసతి కల్పించారు. హంటర్‌రోడ్‌లోని సంతోషిమాతా గార్డెన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 120 మందితోపాటు మైసయ్యనగర్, కాశీకుంట, వాంబే కాలనీ, బీఆర్‌నగర్, వినాయకనగర్, గాంధీనగర్‌లోని సుమారు 900 మందికి బల్దియా అధికారులు ఉదయం టీఫిన్తో పాటు రెండు పూటలా భోజనం అందించారు. ముంపు కాలనీల్లో పరిస్థితులు చక్కబడే వరకూ పునరావాస కేంద్రంలో భోజన వసతి కల్పిస్తామని అధికారులు తెలిపారు.