ఏటూరునాగారం, సెప్టెంబర్ 11 : అంతరిస్తున్న జీవనాధార వృక్ష సంపదను కాపాడడంతో పాటు ఉత్పత్తుల సేకరణతో గిరిజనుల ఆదాయం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం వన్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు శాస్త్రీయ పద్ధతిలో ఉత్పత్తులు సేకరించేందుకు అవసరమైన పనిముట్లు సమకూర్చనున్నారు. ఈమేరకు జీసీసీతో సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమన్వయంతో స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేశారు. సేకరణపై మెళకువలు నేర్పడం, వృక్షాలను విచ్చలవిడిగా నరికివేయకుండా చూడడం, ఆర్థిక వనరులను పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నారు. ఫలితంగా గిరిజనులు ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందనున్నారు. అలాగే అవసరమైన చెట్లను కాపాడుకోవడంలో వీరంతా భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో సంఘాలు ఏర్పాటుచేశారు. ఏటూరునాగారం జీసీసీ డివిజన్ పరిధిలో ఏటూరునాగారం, నర్సంపేట, ములుగు, మహదేవ్పూర్, వెంకటాపూర్, మన్ననూరు బ్రాంచి పరిధిలో అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతో 90 గ్రూపులను ఏర్పాటుచేశారు. ఒక్కో గ్రూపులో 20మంది సభ్యులు ఉండనున్నారు. 20మంది గ్రూపు కలిగిన సభ్యులతో ఒక్కో జీసీసీ బ్రాంచి పరిధిలో 15 గ్రూపులతో కలిపి వన్ధన్ వికాస కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని పరిధిలో 300మంది ఉంటారు. వికాస కేంద్రాన్ని రిజిస్టర్ చేయనున్నారు. దీంతో 1800 మంది గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో కేంద్రంలో అవసరమైన కంప్యూటర్లు, రిజిస్లర్లులు సమకూర్చడంతో పాటు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. శిక్షణ ఇవ్వడానికి గ్రూపునకు ఇద్దరు రిసోర్స్ పర్సన్లను నియమించడంతో పాటు జీసీసీ నుంచి మరో ఆరుగురిని నియమించారు. ఇప్పటికే ఆయా బ్రాంచి పరిధిలో సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
గిట్టుబాటు ధర వచ్చేలా
సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. జీసీసీ ద్వారా కొనుగోలు చేయనున్నారు. ఇందుకుగాను జీసీసీ ధరలను కూడా ప్రకటించింది. కిలో తేనెకు రూ.225, మారేడు గడ్డ రూ.190, తేనె మైనం రూ.120, తప్సి జిగురు రూ.114, చింతపండు రూ.70, విషముష్టి గింజలు రూ.45, ఎండు ఉసిరి పప్పు రూ.52, చిల్ల గింజలు రూ.35, నర మామిడి చెక్క రూ.32, ఇప్పగింజలు రూ.29, ఇప్పపూవు రూ.30, కరక్కాయలు రూ.14, కుంకుడు కాయలు రూ.14, నల్లజీడి గింజలు రూ.12, కానుగ గింజలు రూ.10లకు కిలో చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇంకా అనేక రకాల ఉత్పత్తులనే సేకరించే అవకాశం కల్పిస్తారు. ఆయా జీసీసీ బ్రాంచిల పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాల ద్వారా వీటిని తీసుకోవడంతో పాటు వారి వద్దకే నేరుగా వెళ్లి సేకరించనున్నారు.
పరిశ్రమల ఏర్పాటు దిశగా..
అటవీ ఉత్పత్తులు అధికంగా లభించే ప్రాంతంతో పాటు ఎక్కువగా సేకరణ జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా వన్ధన్ వికాస కేంద్రాల ఆధ్వర్యంలో పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో పలు ప్రాంతాల్లో మహిళలతో జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా పరిశ్రమలను నెలకొల్పారు. అదిలాబాద్ జిల్లాలో ఇప్పపూవు విరివిగా లభించడంతో అక్కడ ఇప్పలడ్డూ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పరిశ్రమలతో గ్రూపుల కొనుగోలు శక్తిని పెరుగడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. అంతేగాక తయారైన పదార్థాలను పౌష్టికాహారం కింద గిరిజనులకు అందించే అవకాశముంది.
ఉత్పత్తుల సేకరణకు పనిముట్లు
అటవీ ఉత్పత్తుల సేకరణపై ప్రత్యేకంగా పనిముట్లు ఇవ్వనున్నారు. ఏ వ్యక్తి ఎలాంటి ఉత్పత్తులు సేకరిస్తారనే విషయమై ఇప్పటికే సర్వే చేయగా, దీని ప్రకారం అవసరమైన పనిముట్లు, రక్షణ కవచాలు, పరికరాలు అందిస్తున్నారు. 5080 గన్నీ సంచులు, 4710 టార్పాలిన్ షీట్లు, 490 అల్యూమినియం టబ్బులు, 490 బకెట్లు, 490 గ్లౌజులు, 627 ప్లాస్టిక్ టబ్బులు, 855 కొడవళ్లు, ఇతర పనిమట్లు 855 ఉచితంగా అందజేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యంగా చెట్లను నరికివేయకుండా, కొమ్మలు విరగకుండా ఎలా సేకరించాలి?, నరమామిడి చెక్క, తేనె, కాయలు, పండ్లు ఎలా కోయాలో అవగాహన కల్పించనున్నారు. ఉదాహరణకు ఇప్పపూవును కింద పడిన వాటినే ఏరుతుంటారు. అలా కాకుండా చెట్టు కింద టార్పాలిన్ షీటు పర్చి అందులో పూలు పడిన తర్వాత కుప్ప చేసి ఎత్తుతారు. అవగాహన లేకుండా నర మామిడి చెక్క కోసం బెరడు తీస్తే చెట్టు చనిపోయే అవకాశం ఉంది. అందుకే పనిమట్లతో ఎలా తీయాలి?, చెట్టును ఎలా రక్షించుకోవాలో తెలియచేస్తారు.
ఉత్పత్తుల సేకరణ పెరుగుతోంది
అటవీ ఉత్పత్తుల సేకరణ విరివిగా పెరుగుతోంది. ఇప్పటికే గ్రూపు సభ్యులకు అవగాహన కల్పించాం. డివిజన్ పరిధిలో 90 గ్రూపులు ఏర్పాటు చేశాం. వీరికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారిలో నైపుణ్యం పెం చుతాం. చెట్లు నరకకుండాఎలా సేకరిం చాలో తెలియచేస్తాం. జీసీసీ ద్వారా కొను గోళ్లతో పాటు అవసరాన్ని బట్టి సభ్యులే మార్కెటింగ్ చేసుకునేలా సంఘాలను సిద్ధం చేశాం. అలాగే వారి బ్యాంకు ఖాతా, ఆధార్, ఫోన్ నంబర్, తదితర వివరాలను యాప్లో నమోదు చేశాం.
34 రకాల ఉత్పత్తులు గుర్తించాం
రాష్ట్రవ్యాప్తంగా 38 రకాల అటవీ ఉత్పత్తులను గుర్తించాం. ఇందులో కొన్ని ఇప్పటికే అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాలి. ఎక్కడ ఎలాంటి చెట్లున్నాయో అటవీశాఖ అధికారులు గుర్తించి చెబుతారు. వాటిని శాస్త్రీయ పద్ధతిలో సేకరించేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైన చోట పరిశ్రమలు నెలకొల్పుతాం. చెట్లు, అడవిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయమై పూర్తి శిక్షణ ఇచ్చాం. ఔషధాల తయారీకి ఉపయోగపడే ఉత్పత్తులు కూడా ఉన్నాయి.