వరంగల్, సెప్టెంబర్ 11(నమస్తేతెలంగాణ) : ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో వాడవాడలా ఈ నెల 2న టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగ నిర్వహించి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభించారు. పార్టీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ కార్యక్రమం వేడుకలా జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు, 13 నుంచి 20వ తేదీలోగా పార్టీ, అనుబంధ, సోషల్ మీడియా కమిటీల నిర్మాణం జరగాల్సి ఉంది. 20వ తేదీ తర్వాత నెలాఖరులోగా స్థానిక ముఖ్యనేతల సమన్వయంతో పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేసి మార్గనిర్దేశనం చేశారు. కమిటీల్లో పార్టీ క్రియాశీల సభ్యులే ఉండాలని, ప్రతి కమిటీలో 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు చోటు కల్పించాలని చెప్పారు.
సమన్వయ కమిటీలు..
పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎమ్మెల్యేలు ఆయా మండలంలోని పార్టీ ముఖ్యనేతలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ కమిటీల నేతలు పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఏకాభిప్రాయంతో గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనలతో రాయపర్తి మండలంలో ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, మండలాధ్యక్షుడు నర్సింహనాయక్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ సురేందర్‌రావు, పార్టీ నేత బిల్ల సుధీర్‌రెడ్డి కొద్దిరోజుల నుంచి గ్రామాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 33 గ్రామాల్లో కమిటీల నిర్మాణం పూర్తయింది. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఈ నెల 6న పార్టీ మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సంస్థాగత నిర్మాణంపై సూచనలు చేశారు. వర్ధన్నపేట మండలం, మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, మండలాధ్యక్షుడు టీ కుమారస్వామి, మున్సిపాలిటీ చైర్పర్సన్ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు పార్టీ శ్రేణులతో సమావేశమై కమిటీలను నిర్మిస్తున్నా రు. వర్ధన్నపేట మండలంలోని పన్నెండు గ్రామాలకు గాను ఐదింటిలో, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండు వార్డులకు గాను ఏడింటిలో కమిటీలను ఏ ర్పాటు చేశారు.
పర్వతగిరి మండలంలో మండలాధ్యక్షుడు రంగు కుమార్, జడ్పీటీసీ సింగులాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్ తదితరులు గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమై గ్రామ కమిటీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ పద్నాలుగు గ్రామాల్లో కమిటీల ఏర్పా టు పూర్తయింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపుతో సంగెం, గీసుగొండ మండలాలు, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని విలీన గ్రామాల్లో గ్రామ కమిటీల ని ర్మాణం జరుగుతున్నది. సంగెం మండలంలో 33 గ్రా మాలకు గాను 27 గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చే శారు. గీసుగొండ మండలంలో 21 గ్రామాలకు గాను 13 గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. స్థానిక జడ్పీటీసీ ధర్మారావు, మండల కార్యదర్శి జయపాల్‌రెడ్డి, కుడా డైరెక్టర్ రాజ్‌కుమార్, పార్టీ నేతలు రాజ య్య, సదానందం తదితరులు కమిటీల నిర్మాణంలో శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. విలీన గ్రామాలైన ధర్మారం, జాన్‌పాక, కీర్తినగర్, గొర్రెకుంట, రెడ్డిపాలెంలోనూ గ్రామ కమిటీల నిర్మాణం పూర్తయింది.
వరంగల్లోనూ కసరత్తు..
జిల్లా కేంద్రమైన వరంగల్లోనూ టీఆర్ఎస్ డివిజన్, అనుబంధ కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నది. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని టీఆర్ఎస్ శ్రేణులతో స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాజశ్రీ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ మేయర్ రిజ్వనా షమీమ్ మసూద్‌తో పాటు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, డివిజన్, అనుబంధ కమిటీల ఏర్పాటు, నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే నన్నపునేని టీఆర్ఎస్ శ్రేణులతో చర్చించారు. టీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని నరేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో పార్టీ అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి పార్టీ నూతన కమిటీల్లో ప్రాధాన్యం ఉంటుందని, అన్ని డివిజన్లలో పార్టీ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామని, ఉద్యమం నుంచి నేటి వరకు పనిచేసిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి కమిటీల్లో చోటు లభిస్తుందని, అంతిమంగా పార్టీనే ఫైనల్ అని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో పార్టీ, అనుబంధ, సోషల్ మీడియా కమిటీల ఏర్పాటు కోసం పార్టీలోని ముఖ్యనేతల్లో ఐదుగురికి బాధ్యతలు అప్పగించారు. కమిటీల నిర్మాణంపై ఆయన ఈ సమన్వయ నేతలకు మార్గనిర్దేశనం చేశారు. డివిజన్ వారీగా పార్టీ శ్రేణులతో సమావేశమై కమిటీల ఏర్పాటుకు సూచనలు చేశారు.