నమస్తే నెట్వర్క్: పూలను పూజించే, ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మగా కొలుస్తున్నారు. నర్సంపేట పట్టణంలో బుధవారం మహిళలు బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేసి, అనంతరం ఆలయాలకు వెళ్లి ఆడిపాడారు. నర్సంపేటలోని వేంకటేశ్వరాలయానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మున్సిపాలిటీ అధికారులు చుట్టు పక్కల వీధులను శుభ్రం చేసి లైట్లు, డీజే మైక్‌లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో బతుకమ్మ సంబురాలను డైరెక్టర్ ఎర్ర ఊర్మిళాజగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్లబెల్లి మండలంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఖానాపురం మండలవ్యాప్తంగా మహిళలు సంబురంగా బతుకమ్మ ఆడిపాడారు. దుగ్గొండి మండలంలో ఆలయాలు, ఊరి చివర ఉన్న చెరువు గట్ల వద్ద బతుకమ్మ ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. కార్పొరేటర్లు ఏర్పాట్లు చేశారు. వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతం, కరీమాబాద్‌లోని బొమ్మలగుడి, కాశికుంట పోచమ్మగుడి, ఉర్సు బొడ్రాయి, ఎస్ ఆర్ఆర్ తోటలోని దుర్గామల్లేశ్వరాలయం, సాకరాశికుంట పోచమ్మ ఆలయం, పెరుకవాడలోని బొడ్రాయి, జన్మభూమి జంక్షన్లో మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సతీమణి నన్నపునేని వాణి పెరుకవాడలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. చెన్నారావుపేట మండలంలోని చెన్నారావుపేట, అమీనాబాద్, జల్లి, అక్కల్చెడ, కోనాపురం, ఉప్పరపల్లి, పాపయ్యపేట, బోజేర్వు, ఖాదర్పేటతోపాటు ప్రతి గ్రామంలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
ఉయ్యాల పాటలతో మార్మోగిన పల్లెలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలతో జిల్లాలోని పల్లెలు మార్మోగాయి. సంగెం మండలంలో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్లకు తీసుకొచ్చి ఆటపాటలతో సందడి చేశారు. పర్వతగిరి మండలవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. చింతనెక్కొండలో మహిళలకు సర్పంచ్ గటిక సుష్మా మహేశ్ హితకారిణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఖిలావరంగల్ కోటలో ఎంగిలిపూల బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి అంతే అందంగా ముస్తాబైన ఆడబిడ్డలు సమీపంలోని ఆలయాల్లోకి వెళ్లి పొద్దుపోయేదాక ఆటపాటలతో సందడి చేశారు. ఖిలావరంగల్ స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి, మెట్టు దర్వాజ, రాణిరుద్రమాదేవి బతుకమ్మ ఆట స్థలం, తూర్పుకోట, ఖమ్మంరోడ్డు పోచమ్మ ఆలయం, పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ, మైసమ్మ ఆలయాలు, శివనగర్‌లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, గణేష్‌నగర్‌లో గణేశ్ మందిరంలో, శివనగర్‌లోని మెట్లబావి, చింతల్లో ఆంజనేయస్వామి ఆలయం, ఆదర్శనగర్, స్తంభంపల్లి, వసంతపురం, దూకుంట, గాడిపల్లి, బొల్లికుంటలో కార్పొరేటర్లు ఏర్పాట్లు చేశారు.
మహిళలు బతుకమ్మ ఆటాపాటల అనంతరం నువ్వులు, బియ్యపు పిండి, నూకలతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్చించి ఒకరికొకరు పంచిపెట్టుకున్నారు. గంగమ్మ ఒడికి బతుకమ్మలను పంపించి ఖాళీ షిబ్బీలతో పాటలు పాడుతూ ఇండ్లళ్లకు చేరుకున్నారు. మట్టెవాడ పరిధిలోని మండిబజార్, బొందలకుంటలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య భార్య లక్ష్మి, 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష తదితరులు పాల్గొని బతుకమ్మ ఆడారు. వరంగల్ రామలింగేశ్వరాలయం వద్ద జరిగిన ఉత్సవాల్లో నగర మేయర్ గుండు సుధారాణి, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన బతుకమ్మ ఆడారు. వరంగల్ 13వ డివిజన్లోని గణేశ్ నగర్, టీచర్స్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి పర్యవేక్షించారు. 12వ డివిజన్ మార్కండేయ కాలనీలో కార్పొరేటర్ కావటి కవిత పాల్గొన్నారు. సెకండ్డాక్టర్స్ కాలనీలోని వరద వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెక్కొండ మండలంలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నెక్కొండలోని ఆంజనేయస్వామి, బొడ్రాయి, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాల ఆవరణలో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. జీపీ పాలకవర్గాలు ఏర్పాట్లు చేశాయి.
శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో..
కాశీబుగ్గ: ఎంగిలిపూల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని కాశీబుగ్గ ప్రాంతంలోని శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. కాశీబుగ్గ, ఎల్బీనగర్, గిర్మాజిపేట, ఎనుమాముల, వివేకానందకాలనీ నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంతోపాటు పురవీధులన్నీ మహిళలతో కిక్కిరిసిపోయాయి. గునుగు, తంగేడు పువ్వులు, బంతి, గుమ్మడి పూలతో అందరంగా అలంకరించిన బతుకమ్మ శిఖర భాగంలో గౌరమ్మను కొలువుదీర్చారు. శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి దేవాలయ కమిటీ సభ్యులు బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కాశీబుగ్గ సొసైటీకాలనీ, ఓసిటీ పార్కు, దయానందకాలనీ శ్రీకనకదుర్గ ఆలయం, గాంధీనగర్, లేబర్‌కాలనీ, సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, పైడిపెల్లి ఎల్లమ్మగుట్ట, కొత్తపేట, ఆరెపల్లిలో స్థానిక మహిళలు బతుకమ్మ ఆట ఆడారు. వర్ధన్నపేట మండలంలో తొలిరోజు బతుకమ్మ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాయపర్తి మండలంలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను చేతబూని గ్రామాల పరిధిలోని ఆలయాలు, జలాశయాల వద్దకు ర్యాలీగా తరలివెళ్లి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకను సంతోషంగా జరుపుకున్నారు.