చెన్నారావుపేట, ఆగస్టు 30: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్ ఒకటి నుంచి పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల మైదానాల్లో సమూహంగా ఉండకుండా చూడాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి సృజన్‌తేజ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం ఆయన చెన్నారావుపేట, అక్కల్చెడ, కోనాపురం, కేజీబీవీ, ఈర్యాతండాలలోని సర్కారు బడులను సందర్శించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులు, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు విధిగా మాస్కు ధరించి రావాలని, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉన్న వారు పాఠశాలలకు రానవసరం లేదని, దగ్గరలోని పీహెచ్సీలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. స్కూళ్లలో పని చేసే మధ్యాహ్న భోజన కార్మికులు వంటశాల, పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తప్పకుండా థర్మల్ స్క్రీనింగ్ చేయాలన్నారు. ఆయన వెంట హెచ్ఎంలు రవి, జ్యోతి, మల్లయ్య, అజయ్‌కుమార్, కృష్ణమార్తి, కృష్ణమోహన్, పవన్‌కుమార్, రవిచంద్ర, ఉపాధ్యాయులు, సీఆర్పీ సంపత్ ఉన్నారు.
పునఃప్రారంభానికి ముస్తాబు
పునఃప్రారంభానికి పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. ఈ మేరకు ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంఈవో చదువుల సత్యనారాయణ సోమవారం మండలంలోని అన్ని ప్రభుత్వ, పైవేటు పాఠశాలలను సందర్శించి శానిటేషన్ పనులను పరిశీలించారు. రోజూ గ్రామ పంచాయతీ సిబ్బందితో పాఠశాలల్లో రసాయనాలను పిచికారీ చేయించాలన్నారు. పిల్లలు గదుల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సోమవారం లక్నేపల్లి, గురిజాల, మహేశ్వరం, కమ్మపల్లి, దాసరిపల్లిలోని సర్కారు బడుల్లో జీపీ సిబ్బంది పారిశుధ్య పనులు నిర్వహించారు. పనులను ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు, ఎంపీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. గీసుగొండ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేస్తున్నారు.