వరంగల్, సెప్టెంబర్ 5(నమస్తేతెలంగాణ) : దళితవాడలు, గిరిజన కుగ్రామాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల అధికారులు జిల్లాలోని పలు దళితవాడలు, గిరిజన కుగ్రామాలన్నింటినీ సందర్శించారు. ఇండ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్రెయిన్స్, రహదారులతో పాటు ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ఇండ్ల సంఖ్య, అంతర్గత రోడ్ల పొడవు.. అందులో బీటీ, సీసీ, మెటల్ రోడ్లు ఎన్ని? డ్రెయిన్స్ ఎన్ని మీటర్లు.. విద్యుత్ స్తంభాలు ఎన్ని ఉన్నాయి.. తాగునీటి సరఫరా పరిస్థితి.. తదితర వివరాలు సేకరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇపుడు ఉన్న డ్రెయిన్స్, రహదారులకు తోడు ఎన్ని కి.మీ. సీసీ రోడ్డు, డ్రెయిన్స్ అవసరం.. కొత్తగా ఎన్ని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనాలు వేశారు. ఈ మేరకు ఎస్టిమేట్స్ తయారు చేశారు.
2,308 దళితవాడలు..
సర్వేలో జిల్లాలోని 301 గ్రామ పంచాయతీల పరిధిలో 2,308 దళితవాడలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా సంగెం మండలంలో 317 ఉన్నాయి. ఆ తర్వాత నర్సంపేట మండలంలో 283, దుగ్గొండిలో 259, రాయపర్తిలో 255 దళితవాడలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. మండలం వారీగా ఖానాపురంలో 85, నల్లబెల్లిలో 149, నెక్కొండలో 195, వర్ధన్నపేటలో 242 దళితవాడలు ఉన్నాయని తెలిపారు. గిరిజన కుగ్రామాలు 2,431 ఉన్నట్లు పేర్కొన్నారు. మండలం వారీగా ఖానాపురంలో 234, నల్లబెల్లిలో 170, నర్సంపేటలో 263, నెక్కొండలో 479, దుగ్గొండిలో 38, రాయపర్తిలో 342, సంగెంలో 170, వర్ధన్నపేటలో 54 ఉన్నట్లు వెల్లడించారు. గిరిజన కుగ్రామాలు అత్యధికంగా నెక్కొండ మండలంలో 479, రాయపర్తి మండలంలో 342 ఉన్నాయి. 2,308 దళితవాడలు, 2,431 గిరిజన కుగ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతులను గుర్తించి అధికారులు నివేదిక రూపొందించారు.
4,083 సీసీ రహదారులు..
జిల్లాలోని 2,308 దళితవాడలు, 2,431 గిరిజన కుగ్రామాల్లో 4,083 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ క్రమంలో 3,43,183 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.151.05 కోట్లతో ఎస్టిమేట్స్ తయారు చేశారు. ఇదే దళితవాడలు, గిరిజన కుగ్రామాల్లో 2,648 డ్రెయిన్స్ నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం 3,32,597 మీటర్ల డ్రెయిన్స్ నిర్మించాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఈ డ్రెయిన్స్ నిర్మాణం కోసం రూ.91.21 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ దళితవాడలు, గిరిజన కుగ్రామాల్లో 5,557 విద్యుత్ స్తంభాల ద్వారా కరంటు సరఫరా జరుగుతోంది. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు ఇంకో 3,338 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని అధికారులు సర్వేలో గుర్తించారు. వీటితో మొత్తం విద్యుత్ స్తంభాల సంఖ్య 8,862కు చేరనుంది. కొత్తగా స్తంభాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు రూ.6.86 కోట్లతో అంచనాలు వేశారు. దళితవాడలు, గిరిజన కుగ్రామాల్లో మౌలిక వసతుల కోసం మొత్తం రూ.249.12 కోట్లు కేటాయించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దళిత సాధికారితకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న దరిమిలా సాధ్యమైనంత త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం ఉంది.