ఖిలావరంగల్, ఆగస్టు 31: వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం దంచి కొట్టింది. మొదటి రోజు 106.2 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు కాగా.. మంగళవారం 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కోటలోని చెరువులు, అగడ్తలు నిండి కట్టపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో మైసయ్యనగర్, శివనగర్ 34, 35 డివిజన్లలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నాలాలు, మురుగు కాల్వలు నిండి రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ పారిశుధ్య కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. మైసయ్యనగర్‌లో మంగళవారం 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్ పర్యటించారు. పునరావాస కేంద్రంలో మైసయ్యనగర్లోని 150 కుటుంబాలకు భోజనం, వసతి ఏర్పాటు చేశారు. తూర్పు కోటలో బండి కొమురమ్మ ఇల్లు కూలిపోయింది. 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ, టీఆర్ఎస్ నాయకులు అరసం రాంబాబు, కందిమల్ల మహేశ్ మహిళను పరామర్శించారు.
అండగా ఉంటాం..
ముంపు ప్రాంతాల బాధితులకు అండగా ఉంటామని కార్పొరేటర్ పోశాల పద్మ అన్నారు. 41వ డివిజన్లోని పలు ముంపు ప్రాంతాలను ఆమె బల్దియా అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, గుండు చందన పరిస్థితులను పర్యవేక్షించారు. ఉర్సు బైపాస్ రోడ్డులోని డీకేనగర్ను డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ సందర్శించారు. కరీమాబాద్‌లోని రామస్వామి గుడి సమీపంలోని రజకవీధిలో రాముల కుమార్ ఇల్లు కూలిపోగా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పరామర్శించారు. వరంగల్ దేశాయిపేట రోడ్డులో కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ. 37 లక్షలతో జరుగుతున్న పనులను రెండు నెలల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గణేశ్‌నగర్, టీచర్స్‌కాలనీ, ఏకశిలానగర్, చైతన్యవీధిలోకి వర్షపునీరు చేరుకుంది. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు పనులు ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్లు సురేష్‌కుమార్ జోషి, బస్వరాజు చిన్న కుమారస్వామి పనులను పర్యవేక్షించారు. మట్టెవాడ పరిధిలోని సంతోషిమాతకాలనీ, ఎన్టీఆర్నగర్ కాలనీ, హంటర్ రోడ్, ఓఎస్నగర్, రామన్నపేట, చార్‌బౌళి, తుమ్మలకుంట ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి వ్యర్థాలు రోడ్లపైకి వచ్చాయి.