దుగ్గొండి, ఆగస్టు 24: మొక్కలు నాటి సంరక్షించడం వల్ల పర్యావరణం వృద్ధి చెంది భవిష్యత్ తరాలు క్షేమంగా ఉంటాయని నర్సంపేట ఏసీపీ సీహెచ్ఆర్వీ ఫణీందర్ అన్నారు. మండలంలోని చలపర్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణ, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్ ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఏసీపీ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఫణీందర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి గ్రామలను హరితవనాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో టేకు మొక్కలు నాటితే పర్యావరణ పరిరక్షణతోపాటు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. కార్యక్రమంలో దుగ్గొండి రూరల్ సీఐ సతీశ్‌బాబు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎస్సైలు నవీన్‌కుమార్, మహేందర్, చలపర్తి సర్పంచ్ ముదురుకోళ్ల శారదాకృష్ణ, ఉపసర్పంచ్ కోటగిరి భాస్కర్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, హెచ్ఎం పెంచాల చంద్రమౌళి, వార్డు సభ్యురాలు రజితాసమ్మయ్య, మహిళా సంఘం సీఏ లక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్ ప్రేమలత, అంగన్వాడీ టీచర్లు పుష్పలీల, రజిత, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత
ఖానాపురం: హరితహారంలో మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యతని ఏసీపీ ఫణీందర్ అన్నారు. కొత్తూరులో పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి రక్షించాలన్నారు. అనంతరం ఆయన గ్రామ శివారులో కూలీలతో కలిసి కలుపు పనులు చేశారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సతీశ్‌బాబు, ఎస్సై సాయిబాబు, ట్రెయినీ ఎస్సై విశ్వతేజ, సర్పంచ్ బూస రమ అశోక్, కార్యదర్శి వరుణ్, జేరిపోతుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ రక్షించాలి
గీసుగొండ: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎస్సై దేవేందర్ కోరారు. వరంగల్ లారీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జాన్‌పాకలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కల రక్షణకు అధిక నిధులు కేటాయిస్తున్నదన్నారు. మనం నాటే మొక్కలు రానున్న తరాలకు ఉపయోగపడుతాయని వివరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఫిరోజ్ అలీ, కార్యదర్శి అజ్మల్, సభ్యులు ఇంతియాజ్, శ్రీనివాసరావు, షరీఫ్, జాఫర్ పాల్గొన్నారు.