పాలకుర్తి రూరల్, ఆగస్టు 31 : సాహితీ ప్రపంచంలో హిమాలయ శిఖరమంత ఖ్యాతి గడించిన జనగామ జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు బాటలుపడ్డాయి. మహాకవుల పుట్టినిండ్లు పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాల్లో పర్యాటకరంగ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీటితో ఇతర చోట్ల చేపట్టిన టూరిజం పనులు సైతం చకచకా కొనసాగుతున్నాయి. సీమాంధ్రుల పాలనలో వివక్షకు గురైన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలకు సీఎం కేసీఆర్ చొరవతో మంచిరోజులు వచ్చాయి. అంతేకాకుండా ఖిలాషాపూర్, జఫర్‌గఢ్ కోటలను పునరుద్ధరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదనల మేరకు బమ్మెర, వల్మిడి, పాలకుర్తి ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించింది. 2017, ఏప్రిల్ 27న సీఎం కేసీఆర్ స్వయంగా బమ్మెరలో పోతనామాత్యుడి సమాధిని సందర్శించి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.0 దీంతో సాహితీప్రియులు, కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.
పాలకుర్తిలో సోమనాథుడి కల్యాణ మండప నిర్మాణానికి రూ.10 కోట్లు, బమ్మెరలో పోత న స్మారక మందిరానికి రూ.7.50 కోట్లు, వల్మిడిలో సీతారామచంద్ర స్వా మి ఆలయ అభివృద్ధి, సత్రాల నిర్మాణానికి రూ.5 కోట్లు, పెంబర్తిలో హస్తకళల అభివృద్ధికి రూ.5 కోట్లు, జఫర్‌గఢ్ కోటకు రూ.6 కోట్లు, రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లోని సర్వాయి పాపన్న కోటకు రూ.6 కోట్లు మంజూరు కాగా, పర్యాటక పనులు చేపట్టారు. మంత్రి ఎర్రబెల్లి పలుమార్లు ‘ఇన్టాక్’ చైర్మన్ ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రభుత్వ మాజీ సలహాదారు బీ పాపారావు, కలెక్టర్‌తో కలిసి పనుల పురోగతిపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి పనులను స్వయంగా పరిశీలించారు. పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి గతేడాది సమీక్ష నిర్వహించడంతో పనుల్లో వేగం పెరిగింది. బమ్మెరలో పోతన స్మారక మందిరం స్లాబ్ పూర్తయింది. పాలకుర్తిలో సోమనాథుడి కల్యాణ మండప పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వల్మిడిలో ఆలయం వద్ద సత్రాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. బమ్మెరను బాసర తరహా అభివృద్ధి చేయాలని మంత్రి ఎర్రబెల్లి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు బమ్మెర, పాలకుర్తి, వల్మి డి గ్రామాలకు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం డబుల్ రోడ్లు మంజూరు చేసింది. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆలయం చుట్టూ సీసీ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి.
జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దుతా
పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, జఫర్‌గఢ్, పెంబర్తి, ఖిలాషాపూర్‌లో పర్యాటక పనులపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తా. టూరిజం పనులు త్వరగా పూర్తి చేయాలన్నదే నా సంకల్పం. పాలకుర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నాది నా కల. బమ్మెరను బాసర తరహా అభివృద్ధి చేస్తా. సీఎం కేసీఆర్ సహకారంతో జనగామ జిల్లాను టూరిజం హబ్‌గా మారుస్తా. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. జీడికల్, పాలకుర్తి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా. ఇక్కడి రిజర్వాయర్లను కూడా టూరిస్టు ప్రాంతాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.
పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లాలి
జనగామ జిల్లా పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లాలి. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, వాల్మికి మహాముని నడయాడిన నేల ఇది. పాలకుర్తి వంటి పుణ్యభూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నిధులు మంజూరు చేయించిన మంత్రి ఎర్రబెల్లి కృషి మరవలేనిది.
మంత్రి ఎర్రబెల్లికి రుణపడి ఉంటాం
బమ్మెర, పాలకుర్తి, వల్మిడి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈ ప్రాంత ప్రజలమంతా రుణపడి ఉంటాం. సమైక్య పాలనలో ఈ ప్రాంత కవులను వారసత్వ సంపదను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ను బమ్మెరకు తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లి పర్యాటక రంగానికి రూ.40కోట్లు మంజూరు చేయించారు.