బంతి పూలకు మార్కెటులో మంచి గిరాకీ ఉంటుంది. పసుపు, నారింజ, ఎరుపు వంటి ఆకర్షణీయమైన రంగులో కనువిందు చేసే ఈ పూల పంటను సంవత్సరం పొడుగునా సాగు చేయవచ్చు. ప్రణాళికతో పంట సాగు చేసి చిన్నచిన్న మెళకువలు పాటిస్తే పుష్కలంగా దిగుబడి వస్తుంది. మార్కెటుకు పూల సరఫరాను అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు చేయవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 260 ఎకరాల్లో బంతి సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తూ విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూల తోటలకు ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా ఎంఐడీహెచ్ పథకం కింద బిందు సేద్యంకు, మల్చింగ్‌కు రెండున్నర హెక్టార్లకు రూ.16 వేల నుంచి రాయితీ ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, సన్న, చిన్నకా రు రైతులకు 90 శాతం వర్తిస్తుంది.
బంతి పూల సాగు ఇలా..
నీరు త్వరగా ఇంకిపోయే, నీరు నిల్వ ఉండని నేలలు అనుకూలం. సారవంతమైన, నల్ల రేగడి నేలల్లో బంతి పూలను సాగు చేయవచ్చు. ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అవసరం. బంతి రకాల్లో ఆఫ్రికన్, ఫ్రెంచ్ రకాలకు ఆదరణ. ఆఫ్రికన్ బంతి పూల సైజు పెద్దదిగా ఉంటుంది. ఫ్రెంచ్ బంతి పొట్టిగా, ముద్దగా పూలు పూస్తాయి. ఎకరాకు సరిపడా నారును పెంచడానికి 500 నుంచి 800 గ్రా. విత్తనం సరిపోతుంది. విత్తడానికి ముందు పాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదల నుంచి రక్షించవచ్చు. నెల వయసు 3-4 ఆకులున్న మొక్కలు నాటడానికి అనుకూలం. సేంద్రియ ఎరువులు ఎకరానికి ఆఖరు దుక్కిలో 8 నుంచి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువులతో పాటు 4 కిలోల అజోస్పైరిల్లమ్, 4కిలోల ఫాస్పో బాక్టీరియాలను వేసి కలియదున్నాలి. దీనితో 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. మిగతా నత్రజనిని నాటిన 30-40 రోజుల తర్వాతపై పాటుగా వేయాలి. నాటిన 55-60 రోజుల వరకు పూత దశలోనూ నేలలో తేమ ఉండేలా చూడాలి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి నీటి తడులివ్వాలి. ఆఫ్రికన్ బంతి మొక్కలను నాటిన 40 రోజులకే తలలు తుంచితే మంచి ఆకారాన్ని పొంది అధిక మోతాదులో పూలు పూస్తాయి. హైబ్రిడ్ రకాల్లో 25 రోజులకే తలలు తుంచాలి. పూలను ఎప్పటికప్పుడు కోయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. పూలను కోసిన తర్వాత తడిపి గోనె సంచి లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డను కప్పి మార్కెట్‌కు తరలించాలి. ఆఫ్రికన్ రకాలు ఎకరాకు 4నుంచి 5 టన్నుల దిగుబడినిస్తాయి.
లాభాలు ఆర్జిస్తున్న నర్సింహులపేట మండల రైతులు
నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ, గోపతండా గ్రామపంచాయతీ పరిధిలో రైతులు ముద్దబంతి పూలు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. గ్రామానికి చెందిన అజ్మీరా విజయ్‌కుమార్, వెంకన్న, శ్రీను, బొబ్బ లింగారెడ్డి తోపాటు మరికొంత మంది రైతులు బంతిపూల సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. విజయ్‌కుమార్ మొదటగా 15 గంటల్లో సాగు చేసి రూ. లక్షా 7 వేలు లాభం పొందాడు. ప్రస్తుతం హోల్సే ల్గా పూలు కిలోకు రూ. 60 నుంచి 80 ఉండగా, రిటెయిల్గా కిలో 100 వరకు ధర ఉందని తెలిపాడు.
ఏటా బంతి పూల సాగు..
ఏటా బంతి పూల సాగు చేస్తున్న. విత్తనాలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెచ్చి, ప్రత్యేక మైన ట్రేలలో నారును పెంచుతాం. ప్రస్తుతం పూలను ఎక్కువగా ఊర్లల్లనే అమ్ముతున్నం. పదేళ్లుగా సాగు చేస్తున్న. మంచి మెళకువలతో పంట వేస్తే కచ్చితంగా లాభం ఉంటుంది.
ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టాలి
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు గడించవచ్చు. నీటి వినియోగం తక్కువ ఉండి, తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ప్రభుత్వ సబ్సిడీలతో అన్నదాతలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలకైనా ఉద్యాన శాఖ అందుబాటులో ఉంటుంది.
ప్రోత్సహించాలి
ప్రభుత్వం బంతి పూల సాగును ప్రోత్సహించాలి. రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందిస్తే లాభదాయకంగా ఉంటుంది. ఖరీదైన విత్తనాలు తీసుకొని రావడం కష్టతరంగా ఉంది. సర్కారే మేలు రకం విత్తనాలను అందించాలి. మొదటిసారి ఎకరంలో పూలు సాగు చేస్తున్న.
ఎకరానికి రూ.2లక్షల వరకు ఆదాయం
మొదట్లో 15 గుంటలు సాగు చేస్తే ఒక పంటకే రూ. లక్షా 70 వేల వరకు ఆదాయం వచ్చింది. గతేడాది వర్షాల కారణంగా లాభాలు రాలేదు. ఈ ఏడాది ఎకరం సాగు చేస్తున్న. ప్రస్తుతం పూలు తెంపే దశకు వచ్చాయి. బతుకమ్మ పండుగకు అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఖమ్మం మార్కెట్‌కు తరలిస్తే క్వింటాకు రూ. 6 వేల వరకు వస్తుంది. రోడ్డు పక్కన ఉండడంతో రిటెయిల్గా కిలో రూ. 100కు అమ్ముతున్నా. ఇతర పంటలతో పొలిస్తే బంతిపూల సాగు లాభదాయకంగా ఉంది.