పర్వతగిరి, సెప్టెంబర్ 7: ప్రజలు కొన్ని రోజుల పాటు దూర ప్రయాణాలు మానుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి సూచించారు. రోడ్లు తెగుతున్న కారణంగా ఇండ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండలంలోని చౌటపెల్లి, పర్వతగిరి గ్రామాల మధ్యలో ఉన్న సోమారం కల్వర్టు వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం తహసీల్ నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరదలతో పలుచోట్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, మరికొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. తహసీల్దార్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయొద్దని, దూర ప్రాంతాలకు వెళ్లిన వారు సకాలంలో ఇంటికి చేరుకోవాలన్నారు. పర్వతగిరి మండలంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, మండలంలోని చింతనెక్కొండ, ఏనుగల్, చౌటపెల్లి, కొంకపాక, గోపనపెల్లి, అనంతారం, అన్నారం షరీఫ్, కల్లెడ, దౌలత్‌నగర్ గ్రామాల చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. కొంకపాక-గోపనపెల్లి గ్రామాల మధ్య లోలెవెల్ కాజ్వే రోడ్డు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
సంగెం: భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ గోపి అన్నారు. కాపులకనపర్తిలో వరంగల్-మహబూబాబాద్ ప్రధాన రోడ్డుపై ఉన్న కాజ్‌వేను పరిశీలించారు. వరద నీటిని పరిశీలించి తాసిల్దార్ విశ్వనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో మహేందర్‌జీ, స్పెషలాఫీసర్ సంజీవరెడ్డి, తాసిల్దార్లు మహబూబ్ అలీ, విశ్వనారాయణ, ఏవోసీహెచ్ యాకయ్య పాల్గొన్నారు.
ఉధృతంగా చెరువుల మత్తళ్లు
మండలంలోని చెరువులు, కుంటలు ఉధృతంగా మత్తళ్లు పోస్తున్నాయి. ఎల్గూర్‌చెరువు మత్తడి మూడు ఫీట్ల ఎత్తులో పోస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. సంగెం-తీగరాజుపల్లి ప్రధాన రోడ్డు పది మోరీల వద్ద వరద తాకిడికి రోడ్డు కొట్టుకుపోయింది. ఎల్గూర్‌చెరువు మత్తడి ఉధృతిని ముమ్మిడివరం వద్ద మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం సర్పంచ్ ఇజ్జగిరి స్వప్న-అశోక్, కార్యదర్శి రమేశ్, వార్డు సభ్యుడు ప్రశాంత్‌గౌడ్, వీఆర్ఏలు సుధాకర్, లింగం, పోలీసు సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.