వరంగల్, ఆగస్టు 31: చేనేత కార్మికులకు ‘చేయూత’ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. చేనేత కార్మికులకు ఆదుకునేందుకు 2017 జూలై ప్రారంభించిన చేయూత పథకం రెండో దఫా డబ్బులు సెప్టెంబర్ 1 నుంచి జమచేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16శాతం డబ్బులు ప్రభుత్వం విడుదల చేసింది. హనుమకొండ జిల్లావ్యాప్తంగా సుమారు 1200 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకు 200 దరఖాస్తులు రాగా, ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. 36నెలల పాటు కార్మికులు తన నెల వారి వేతనంలో 8శాతం పొదుపు చేస్తే దానికి రెట్టింపు అంటే 16శాతం ప్రభుత్వం కలిపి కార్మికుడి పేరిట జమచేస్తుంది. మూడేళ్ల తర్వాత కార్మికుడి పొదుపు చేసుకున్న నగదుతో పాటు ప్రభుత్వం జమ చేసిన వాటిని కలిపి కార్మికుడికి అందజేస్తుంది. చేనేత కార్మికులతో పాటు అనుబంధంగా పనిచేసే డైయర్స్, డిజైనర్స్, వీవర్స్, వైండర్స్కు కూడా చేయూత పథకం వర్తింపజేస్తున్నారు. చిన్న మొత్తం కార్మికులు పొదుపు చేసుకుంటే మూడు సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందనున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే చేనేత కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
రెండు ఖాతాలు తీసుకోవాలి..
చేయూత పథకానికి దరఖాస్తులు చేసుకునే కార్మికులు బ్యాంక్లో సేవింగ్ ఖాతాతో పాటు రికరింగ్ డిపాజిట్(ఆర్డీ)-1. ఆర్డీ-2 ఇలా రెండు ఖాతాలు తీసుకోవాలి. రికరింగ్-1 ఖాతాలో కార్మికుడు తన నెలసరి వేతనంలో 8శాతం పొదుపు డబ్బులు జమచేయాలి. రికరింగ్-2 ఖాతాలో ప్రభుత్వం కార్మికుడి ఖాతాలో రెట్టింపు డబ్బులు జమచేస్తుంది. మూడేళ్ల తర్వాత రెండు ఖాతాల్లోని మొత్తం డబ్బులను కార్మికుడి సేవింగ్ అకౌంట్లో జమచేస్తారు. అప్పుడు నేరుగా కార్మికుడు పెద్ద మొత్తం జమ అయిన డబ్బులను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పేద చేనేత కుటంబాలకు చేయూత పథకం ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధిపొందే అవకాశం ఉంది. కార్మికులు నేరుగా గానీ చేనేత సహకార సంఘాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హనుమకొండ, పరకాల, కమలాపూర్ మండలాల పరిధిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండగా పథకంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేస్తున్నారు.