వరంగల్, ఆగస్టు 30: రెండు రోజులుగా కురుస్తున్న జోరు వానకు నగరం అతలాకుతలం అవుతున్నది. గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఉర్సు చెరువు, ఖిలావరంగల్‌లోని ఆగర్తాల చెరువు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సోమవారం మేయర్ గుండు సుధారాణి, వరంగల్ అదనపు కలెక్టర్ హరిసింగ్ పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఇన్చార్జి కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాలు జారీ చేశారు. హంటర్‌రోడ్‌లోని సంతోషిమాత గార్డెన్లో బల్దియా అధికారులు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బృందావన్ కాలనీ, సంతోషిమాతాకాలనీ, ఎన్టీఆర్నగర్ ముంపునకు గురికావడంతో ఆయా కాలనీల కుటుంబాలను పునరావాస కేంద్రానికి బల్దియా అధికారులు తరలించారు. చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో వారికి రెండు పూటలా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కాశీకుంట వాంబేకాలనీ, మైసయ్యనగర్ వాసుల ఇళ్లలోకి వరద నీరు రావడం, ఆహార దినుసులు నీటిపాలు కావడంలో ఆయా కాలనీవాసులకు బల్దియా అధికారులు ఇంటింటికీ ఆహార పొట్లాలు అందజేశారు. పరిస్థితులు చక్కబడే వరకూ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తామని బల్దియా అధికారులు తెలిపారు. బల్దియా డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎన్టీఆర్నగర్, శివనగర్ ప్రాంతాల నుంచి సుమారు 30 మందిని రక్షించారు. బల్దియా ఫైర్ అధికారి కిశోర్ నేతృత్వంలో డీఆర్ఎఫ్ బృందాలు సహయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ డీఆర్ఎఫ్ బృందాలు సహయక చర్యలు చేస్తున్నారు.
టోల్‌ఫ్రీ నంబర్లు
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బల్దియా అధికారులు టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల కోసం 18004251980, 9701999645 బాధితులు నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. సమస్య తీవ్రతను తెలిపే ఫొటోలు తీసి 7997100300 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు భరోసా ఇచ్చారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటన
సంతోషిమాతాకాలనీ, కాశీకుంట, వాంబేకాలనీ, మైసయ్యనగర్ ప్రాంతాలను మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. సత్వర చర్యలు చేపట్టాలని చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డిని ఆదేశించారు. 40వ డివిజన్ డీకే నగర్లో వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు పోశాల పద్మ స్వామి, గందె కల్పన నవీన్, మరుపల్ల రవి, డీఎఫ్‌వో కిశోర్, ఈఈ శ్రీనివాస్, డీఈ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, ఏఈ రంజిత్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్‌రాజ్ ఉన్నారు.
సహాయక చర్యలు..
కరీమాబాద్/గీసుగొండ/కాశీబుగ్గ: అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాలు, కుంటలు పూర్తిగా జలమయమయ్యాయి. కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన పరిస్థితిని తెలుసుకున్నారు. ఉర్సు చెరువు మత్తడి దుంకుతున్నది. గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్, 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల మనోహర్ కాలనీల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. మట్టెవాడ పరిధి సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్నగర్ కాలనీ, హంటర్‌రోడ్, బృందావన్ కాలనీ, ఓఎస్నగర్, రఘునాథ్కాలనీ, రామన్నపేట, మండిబజార్, చార్‌బౌళి, కొత్తవాడలోని తుమ్మలకుంట ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీల్లోని వ్యర్థాలు రోడ్లపైకి వచ్చాయి. బీట్‌బజార్, ఎంజీఎం సర్కిల్ నీటితో నిండిపోయాయి. 28వ డివిజన్ కార్పొరేటర్ గంద కల్పలానవీన్ సహాయక చర్యలు చేపట్టారు. కాశీబుగ్గ పరిధి 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్, సాయిగణేశ్కాలనీ, లక్ష్మీగణపతికాలనీ, మధురానగర్‌కాలనీ, 19వ డివిజన్లోని వివేకానందకాలనీ, గాంధీనగర్ జలమయమయ్యాయి. 20వ డివిజన్లోని పద్మనగర్, శాంతినగర్ నీటమునిగాయి. ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల రోడ్లను తవ్వి వరద నీటిని దారి మళ్లించారు.
ముంచెత్తిన వాన
జిల్లావ్యాప్తంగా 278.8 మిల్లి మీటర్ల వర్షం కురిస్తే.. ఒక వరంగల్ నగరంలోనే 106.2 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తున్నది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ దంచి కొట్టిన వానతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖిలావరంగల్ మధ్యకోటలోని ఏకశిల చెరువు, పడమర కోటలోని అగడ్త(చెరువు) వరద నీరు శివనగర్‌లోని 34, 35 డివిజన్లకు భారీగా చేరుకుంది. దీంతో శివనగర్‌లోని మైసయ్యనగర్, శివగణేశ్‌నగర్, వందన స్కూల్, హాస్టల్ లైన్, విశ్వనాథకాలనీ, పల్లవీ దవాఖాన ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై ప్రవహించింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అదనపు కలెక్టర్ హరిసింగ్, ఖిలావరంగల్ తాసిల్దార్ మంజుల, మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, 34, 35వ డివిజన్ల కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్ కాలనీలను సందర్శించారు. పాకివాడ, మైసయ్యనగర్తో జలదిగ్బంధంలో ఉండడంతో బాధితులను సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. మధ్యకోటలో సుమారు 50 ఎకరాల్లో సాగైన వరి, కూరగాయ తోటలు నీటమునిగాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వల్ల ఖిలావరంగల్‌కు వచ్చే 11 కేవీ కరంట్ స్తంభాలు ఒరిగిపోగా, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమాదామోదర్యాదవ్, విద్యుత్ శాఖ అధికారులు ఏడు గంటలపాటు కష్టపడి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పడమరకోటలో బొల్లం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌కు చెందిన ఇళ్లు సోమవారం తెల్లవారుజామున భారీ వర్షానికి కూలిపోయాయి.