కమలాపూర్, ఆగస్టు 31: దళితబిడ్డలను ధనికులను చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద కన్నూరుకు చెందిన కనకం రవీందర్‌కు ట్రాక్టర్‌ను, కమలాపూర్‌కు చెందిన మాట్ల సుభాష్‌కు సెంట్రింగ్ కిట్‌ను దళితబంధు పథకం కింద ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదిగితేనే సామాజిక వివక్ష పోతుందని సీఎం కేసీఆర్ దళితబందు పథకం తెచ్చారని చెప్పా రు. దేశంలో 20శాతం ఉన్న దళితుల అభివృద్ధికి ఏ నాయకుడూ ఆలోచన చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేయడమే కాకుండా ఆచరణలో చేసి చూపించిన మహానుభావుడన్నారు. దళితబందు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వేరే రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌కు ఫోన్లు చేసి పథకం గురించి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు అందజేసి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు కేసీఆర్ అని కొనియాడారు. దళితజాతి అభ్యున్నతి కోసం పోరాటం చేసిన మేధావులు, ఉద్యోగులు ఈ పథకం విజయవంతం కోసం కలిసిరావాలని పిలుపునిచ్చారు. 2003లో నే దళితుల అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఎజెండాగా పెట్టుకున్నట్లు గుర్తుచేశారు. దళితబిడ్డగా దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు అందించడం తన పూర్వ జన్మ సుకృతంగా అభివర్ణించారు.
చరిత్రలో నిలిచిపోతుంది: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
దళితబందు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ కలలను సాకారం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. దళితబంధు పథకాన్ని అమలు చేసి అభనవ అంబేద్కర్గా కేసీఆర్ నిలిచిపోయారన్నారు. ఇతర పథకాలు ఎలా అమలవుతున్నాయో అలానే దళితబంధు కూడా ఇస్తామని, ఎవరూ అనుమానాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. సర్వే పూర్తి కాగానే సెప్టెంబర్ 10లోగా అందరి ఖాతాల్లో రూ.పది లక్షల చొప్పున జమ చేస్తారని వెల్లడించారు. దళితబంధు పథకం సీఎం కేసీఆర్ కల అని ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విప్ బాల్క సుమన్ ట్రాక్టర్ తాళం చెవి అందించగా దానిపై లబ్ధిదారు కనకం రవీందర్ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డ్రైవింగ్ చేశారు. లబ్ధిదారులకు స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీ లత, సర్పంచ్ విజయ, వైస్ ఎంపీపీ శైలజ, ఎంపీడీవో పల్లవి, తహసీల్దార్ జాహేద్పాషా, సర్పంచ్ పుల్లూరి రాంచందర్‌రావు పాల్గొన్నారు.