వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 30 : జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 641 మంది సిబ్బందితో 207 సబ్ సెంటర్లతో పాటు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారని తెలిపారు. గురువారం 13,607 మందికి వ్యాక్సిన్ వేశామని, 10,344 మందికి మొదటి డోసు, 3,263 మందికి రెండో డోసు వ్యాక్సిన్ అందించామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకు 83,418 మంది మొదటి డోసు, 24,729 మంది రెండు డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. త్వరలో ప్రభుత్వం నిర్దేశించిన వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 31 గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 10 వ్యాక్సినేషన్ వాహనాల వినియోగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు.
కరీమాబాద్ : వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. 40వ డివిజన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
నర్సంపేట రూరల్ : కొవిడ్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏనుగల్తండా సర్పంచ్ బానోత్ స్వాతి అన్నారు. తండాలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరన్న, సీతారాం, కిరణ్, కమ్మలమ్మ, సునీత, కిషన్, కౌసల్య పాల్గొన్నారు.
నర్సంపేట : వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా వైద్య సిబ్బంది ఇప్పటివరకు టీకాలు వేసుకోని వారిని గుర్తిస్తున్నారు. ఇంటింటా తిరుగుతూ టీకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరోనా రాకుండా ముందస్తుగా అందరూ టీకాలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
గంగదేవిపల్లిలో వంద శాతం పూర్తి..
గీసుగొండ : గంగదేవిపల్లిలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వైద్యాధికారి మాధవీలత తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. సర్పంచ్ గోనె మల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు