ఖిలావరంగల్, అక్టోబర్ 1: జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, నెహ్రూ యువకేంద్రం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన ప్రారంభించారు. నెహ్రూ యువకేంద్రం యువజన అధికారి చింతల అన్వేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని నిర్మించాలని, అందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతను పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కనీసం 30 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించి జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు, పర్యావరణానికి హాని కలిగించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వం, స్వచ్ఛంద, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వీధివ్యాపారులు, వాకర్స్ అసోషియేషన్లు ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, వ్యాపార సముదాయాలు, కాల్వల వంటి ప్రాంతాల్లో ఎలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. అనంతరం అక్టోబర్ నెలలో నిర్వహించాల్సిన యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. తర్వాత క్లీన్ ఇండియా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు, డీఈవో వాసంతి, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుల కష్టాలు తెలుసుకోవాలి
వయోవృద్ధుల చట్టాలను సకాలంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గోపి అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల కష్టాలను అడిగి తెలుసుకోవాలని, సహృదయంలో అర్థం చేసుకోవాలని, వారికి అన్నీ సమకూర్చాలన్నారు. అదనపు కలెక్టర్ హరిసింగ్, కృష్టారెడ్డి, వేముల గౌరీశంకర్ పాల్గొన్నారు.