నర్సంపేట, నవంబర్ 12: ‘ధ్యానానికి మద్దతు ధర ఇవ్వాలన్నా, తగ్గించాలన్నా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, సీఎం కేసీఆర్‌ను ఎలా ప్రశ్నిస్తున్నారు’ అని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలో వేలాది మంది రైతులతో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం పంటకు మద్దతు ధరను ఎంఎస్పీ నిర్ణయించేంది కేంద్రమేనని, రూ. 20, రూ. 30 పెంచేది కూడా కేంద్రమేనని అన్నారు. మద్దతు ధరను పెంచుకుంటున్నట్లు ప్రకటనలు కూడా చేసేది కేంద్రమేనని స్పష్టం చేశారు. మద్దతు ధరలను నియంత్రించే, సమీక్షించే అధికారం కూడా కేంద్రానిదేనని వెల్లడించారు. గోడౌన్లలో ధాన్యం నిల్వ చేసే, ఫుడ్గ్రైన్స్ అమలు చేసే అధికారం ఢిల్లీ చేతుల్లో ఉందన్నారు. ధరలు నిర్ణయించేది కేంద్రమైతే కొనుగోలుకు కేసీఆర్‌ను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. పంటల మార్పిడీ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తేనే అయ్యే పని కాదన్నారు.
ఏయే పంటలు వేయాల్లో కూడా కేంద్రం రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని గుర్తుచేశారు. ఇవన్నీ ఏం చేయకుండానే పంటల మార్పిడీ చేయాలని, ధాన్యాన్ని కొనుగోలు చేయమని అంటున్నదని ధ్వజమెత్తారు. పంజాబ్, హార్యానా రాష్ట్రంలో వానాకాలం, యాసంగి వరి పంటను సాగు చేస్తున్నారన్నారు. ఎక్కడా తినడానికి తిండి లేనప్పుడు తెలంగాణ రైతులు సాగు చేసిన ఏ రకమైన వరి పంట అయినా బతిమిలాడి తీసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ రైతుల పక్షమని, రాబోయే రైతు ఉద్యమాల్లో పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోనే నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కువగా వరిసాగు చేస్తారన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు సమాచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, బండి రమేశ్, మోతే జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.