హసన్‌పర్తి, మే 29 : ఐకేపీ సెంటర్లో కాంటా పెట్టిన వడ్లను మిల్లుకు తరలిం చకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హసన్ పర్తి మండలం మడిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మడిపల్లికి చెందిన రైతు ముంజ శ్రీనివాస్‌గౌడ్(49) తన ఎకరం పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పండిన వడ్లను 20 రోజుల క్రితం మడిపల్లి లోని ఐకేపీ సెంటర్లో పోశాడు. రోజుల తరబడి ఎదురుచూడగా, మూడు రోజుల క్రితం కాంటా పెట్టారు.
కానీ, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు రైస్ మిల్లుకు తరలించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించి రైతులు వెంటనే శ్రీనివాస్ ఒంటిపై నీళ్లు పోయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఐకేపీ సెంటర్ వారితో మాట్లాడి శ్రీనివాస్ వడ్లను మిల్లుకు పంపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.