కమలాపూర్, ఆగస్టు 30 : గొల్ల, కురుమ కులస్తులు ఐకమత్యంతో ఉండి, రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో గొల్ల, కురుమ కులస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమలతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇటీవల ప్రభుత్వం రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసిందన్నారు. సీఎం కేసీఆర్ యాదవులను గుర్తించి, హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఐకమత్యంతో ఉండి శ్రీనివాస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం దళితకాలనీలో తిరుగుతూ దళితబంధుపై ప్రచారం నిర్వహించారు. రోడ్డుపై ఉన్న కృష్ణమూర్తి అనే దివ్యాంగుడిని కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. ఎస్సీ కాలనీకి చెందిన ఏకు రాజు రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడి ఉండడంతో అతడి ఇంటికి వెళ్లి పరామర్శించి, రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాంయాదవ్, కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు నగేశ్, అరుణ్‌కుమార్, రాంచంద్రయ్య, మండల యాదవ సం ఘం అధ్యక్షుడు పోతనవేన రాజయ్య, గొట్టె కుమార్, గొట్టె రవి, రాంచందర్ పాల్గొన్నారు.
బాల్క సుమన్ చిత్రపటానికిపాలాభిషేకం
మండలంలోని శనిగరం గ్రామంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో ఈనెల 28న పంచాయతీ నూతన భవ న నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన బాల్క సుమన్ స్థానికంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ.5లక్షలు మంజూరు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుమన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బొచ్చు కరుణాకర్, చెరుకుపల్లి జగన్‌బాబు, చెరుపల్లి సుమన్, కుమార్, దయాకర్, వక్కల ప్రశాంత్, మొగిలి, ప్రవీణ్ పాల్గొన్నారు.