వరంగల్, నవంబర్20(నమస్తే తెలంగాణ) : మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 63 వైన్ షాపులను లాటరీ పద్ధతి ద్వారా అధికారులు వ్యాపారులకు కేటాయించారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన లక్కీ డ్రా నిర్వహణ సాయంత్రం 4.10 వరకు కొనసాగింది. డిసెంబర్ 1 నుంచి 2021-23 కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో వ్యాపారులకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించేందుకు ఎక్సైజ్‌శాఖ ఈనెల 9న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు నుంచి ఈనెల 18 వరకు జిల్లాలోని 63 మద్యం దుకాణాలకు వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందు కోసం ఎక్సైజ్ శాఖ హనుమకొండ నిట్ సమీపంలోని ఈఎస్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు తెరిచింది. మొత్తం 1793 దరఖాస్తులు వచ్చాయి. 63 వైన్‌షాపుల్లో గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీలకు డ్రా ద్వారా 22 దుకాణాలను అధికారులు కేటాయించారు. గురువారం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత శనివారం హన్మకొండ నిట్ సమీపంలోని తారా గార్డెన్లో డ్రా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ బీ గోపి లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపును ప్రారంభించారు.
గెజిట్ నంబర్ ప్రకారం..
గెజిట్ నం 1వ దుకాణం నుంచి కేటాయింపును చేపట్టారు. 63 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన 1793 మంది వ్యాపారులు లేదా వారి ప్రతినిధులు డ్రాకు హాజరయ్యారు. మద్యం దుకాణాల వారీగా దరఖాస్తుదారులను వేదిక వద్దకు పిలిచి వారి సమక్షంలో కలెక్టర్ డ్రా తీశారు. లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ వ్యాపారుల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. దుకాణాల కేటాయింపును వ్యాపారులు వీక్షించేలా ఎక్సైజ్ అధికారులు గార్డెన్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు చేసిన ఎక్సైజ్ అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారి పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన డ్రా కార్యక్రమంలో ఏఈఎస్ కరంచంద్, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎక్సైజ్‌శాఖ నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట స్టేషన్ల ఇన్స్పెక్టర్లు రాజసమ్మయ్య, జగన్నాథరావు, పవన్‌తో పాటు ఎస్సైలు పాల్గొన్నారు. స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మద్యం దుఖాణాల కేటాయింపు ప్రశాంతంగా జరగడంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.