ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టంకట్టి వారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఆలయం నవోదయ విద్యాలయం. అందుకే ఇందులో తమ పిల్లల్ని చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీపడుతుంటారు. తాజాగా మామునూరులోని నవోదయలో 2022-2023 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20 నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తుండగా, నవంబర్ నెలాఖరు వరకు గడువు విధించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ఉమ్మడి జిల్లాలోని 15 బ్లాకుల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ఉత్తమ విద్యా బోధనతో నవోదయ విద్యాసంస్థలు ముందుంటే విద్యార్థులు ర్యాంకులతో పాటు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అందుకే ఇందులో చదవాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. దరఖాస్తులు చేసుకున్న నాటి నుంచి పరీక్ష రాసే సమయం వరకు ప్రత్యేక శిక్షణ తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు. నవోదయలో సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని ధీమాగా ఉంటాతరు. అందులో భాగంగా మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలమం ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు గడువు ఉండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఉమ్మడి వరంగల్‌లోని విద్యార్థులు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. 30 ఏప్రిల్ 2022 పరీక్షను నిర్వహించి ఎంపిక చేస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను బట్టి సెంటర్లను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తు చేసే సమయంలో బ్లాక్‌లు, మండలాలు ఇతరత్రా సమాచారం తప్పులు లేకుండా చూసుకోవాలి.
75శాతం గ్రామీణ.. 25శాతం ఓపెన్ కోటా
నవోదయ విద్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులకు 80 సీట్లు ఉన్నాయి. అందులో 75 శాతం గ్రామీణ విద్యార్థులకు, 25 శాతం ఓపెన్ కోటా కింద కేటాయిస్తారు. అందులో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 33 శాతం బాలికలకు, ఓబీసీకి 25 శాతం, ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
6 నుంచి 12 వరకు విద్యాబోధన..
పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి సీటు సాధించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించి వసతి కల్పిస్తారు. ఉన్నత విలువలతో కూడిన పాఠాలు బోధిస్తారు. సీబీఎస్సీ సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలుంటాయి. ఇటు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తారు. నవోదయ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు.
ఉమ్మడి జిల్లాలో 15 బ్లాకులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాను 15 బ్లాకులుగా విభజించారు. బ్లాకుల వారీగా మండలాలను సైతం కేటాయించారు.
చేర్యాల బ్లాకులో చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట, మద్దూర్ మండలాలు ఉన్నాయి.
చిట్యాల బ్లాకులో చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాలు ఉన్నాయి.
ఏటూరునాగారం బ్లాక్‌లో ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట మండలాలు.
స్టేషన్‌ఘన్‌పూర్ బ్లాక్‌లో ఘన్పూర్ స్టేషన్, జఫర్‌గఢ్ మండలాలు.
గూడూరు బ్లాక్‌లో గూడూరు, కొత్తగూడ, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాలు.
హనుమకొండ బ్లాక్‌లో హసన్‌పర్తి, హనుమకొండ, ధర్మసాగర్ మండలాలు.
జనగామ బ్లాక్‌లో జనగామ, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండలాలు.
కొడకండ్ల బ్లాక్‌లో కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పల మండలాలు ఉన్నాయి.
మహబూబాబాద్ బ్లాక్‌లో మహబూబాబాద్, కేసముద్రం, కురవి, డోర్నకల్ మండలాలు.
మరిపెడ బంగ్లా బ్లాక్‌లో మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి.
ములుగు బ్లాక్‌లో ములుగు, వెంకటాపూర్, ఘన్పూర్(ఎం) మండలాలు ఉన్నాయి.
నర్సంపేట బ్లాక్‌లో నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు ఉన్నాయి.
పరకాల బ్లాక్‌లో పరకాల, రేగొండ, శాయంపేట మండలాలు ఉన్నాయి.
వరంగల్ బ్లాక్‌లో ఆత్మకూరు, సంగెం, గీసుగొండ, వరంగల్ మండలాలు ఉన్నాయి.
వర్ధన్నపేట బ్లాక్‌లో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలు ఉన్నాయి.
నవోదయలో ఉజ్వల భవిష్యత్..
ఏటా వచ్చే వారితో పాటు ఉన్న విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయం ద్వారా ఉజ్వల భవిష్యత్తు అందించడమే లక్ష్యం. ఇక్కడ క్రమశిక్షణతో కూడిన బోధన ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, పూర్తిస్థాయి వసతులు కల్పిస్తున్నాం. చదువుతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 80 సీట్లు ఉన్నాయి. నవంబర్ 30వరకు దరఖాస్తులకు గడువు ఉంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పులు లేకుండా చూసుకోవాలి.