వరంగల్, ఆగస్టు 27: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున ఈ నెల 31లోగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 141 ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. యంత్రాలను వినియోగించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 31న గ్రేటర్‌లోని 141 బడుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. తరగతి గదులతోపాటు పరిసరాల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మేయర్ హెచ్చరించారు.
స్వచ్ఛ ఆటోలకు టార్గెట్ విధించాలి
స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సుధారాణి సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త సేకరణపై టార్గెట్ విధించాలన్నారు. ఇందుకోసం డంపింగ్ యార్డుల్లో వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని డీఈ నరేందర్‌ను ఆదేశించారు. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లలో ర్యాంపులు నిర్మించాలన్నారు. గ్రేటర్‌లోని 25 డీఆర్సీ సెంటర్లలో 19 మాత్రమే పని చేస్తున్నాయని, మిగితా ఐదు డీఆర్సీ సెంటర్లను బలోపేతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను తనిఖీ చేస్తామని, మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు. సమావేశంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డీఈ నరేందర్, శానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్, ఐటీసీ వావ్ ప్రతినిధులు, కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో మేయర్ తనిఖీలు
గ్రేటర్ వరంగల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరుగాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. పలు డివిజన్లలో ఆమె పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మకొండలోని కాకాజీకాలనీ, హన్మకొండ చౌరస్తా, ఫ్లవర్ మార్కెట్, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. డ్రైనేజీల్లో సీల్ట్పై ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయని, వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. షాపుల ఎదుట డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకొని వ్యర్థాలను అందులో వేయాలని వ్యాపారులకు సూచించారు. వారం రోజుల్లో పారిశుధ్య వ్యవస్థలో మార్పు రావాలని, లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రోడ్లపై చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా జరిమానా విధించాలన్నారు. మేయర్ వెంట స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, ఉపేందర్, జవాన్లు ఉన్నారు.