వరంగల్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం సున్నం పెడుతున్నది. వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నది. తెలంగాణలో ప్రధాన పంటగా ఉన్న వరికి ఉరేస్తున్నది. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక ప్రతి ఎకరాకు సాగునీరు, ఉచితంగా నిరంతర కరెంటు, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి అవుతున్నది. ఇప్పుడి ప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న తెలంగాణ రైతాంగంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్నది. యాసంగి వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వడ్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే కేంద్రం మోసపూరితంగా వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల నుంచి బియ్యం తీసుకునేది లేదని భారత ఆహార సంస్థ లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వానకాలం నాట్లు ముగిసిన తర్వాత లేఖ పంపింది. రైతులకు కనీస మద్దతు ధరలు రాకుండా రూపొందించిన సాగు చట్టాలకు కొనసాగింపుగా వడ్ల కొనుగోలుకు కేంద్రం మోకాలడ్డింది. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి రాష్ర్టాల నుంచి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణ కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని, ఇతర కేంద్ర మంత్రులను కోరారు. ఈ విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయినా సీఎం కేసీఆర్ వానకాలం వడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. యాసంగి వడ్ల విషయంలో మాత్రం కేంద్రం రైతులను మోసం చేసేలా వ్యవహరిస్తున్నది. తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే వరి పంట కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. రెండేండ్లుగా ఈ ఆంక్షలను ఇంకా పెంచుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్రం ఈ పక్రియ నుంచి వైదొలుగుతున్నది. కేంద్రం చర్యలతో మన రాష్ట్రంలో పండిన మొత్తం పంటను కొనే పరిస్థితి లేకుండా పోతున్నది. వానకాలం పంటను కేంద్రం పూర్తి స్థాయిలో కొంటుందో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఇక యాసంగి ధాన్యాన్ని సేకరించేది లేదని తెగేసి చెప్పింది. దీంతో రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ క్రమంలో కేంద్రం తీరుపై రైతుల్లో ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం గోస పెడుతాంది
చిట్యాల, డిసెంబర్ 23: యాసంగిల వడ్లు కొనమని చెప్పి కేంద్రప్రభుత్వం రైతులను గోస పెడుతాంది. బీజేపీకి మా ఉసురు తగులుతది. ధాన్యం విషయంలో పూటకోమాట మాట్లాడుతాంది. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాంది. రానున్న రోజుల్ల రైతులు ఆ పార్టీకి బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా మొండిగా మాట్లాడకుండ వడ్లు మొత్తం కొనేలా సీదాగా చెప్పాలె.
వడ్లను కొనమనడం సరికాదు
మహాముత్తారం, డిసెంబర్23: రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనమనడం సరికాదు. ఎండకు ఎండి, వానకు నాని వడ్లను పండిస్తే తీర టైంకు కొనమని చెప్పడం మంచిది కాదు. పేరుకే రైతును రాజు అంటున్నారు.. కానీ చివరికి ఏం మిగుల్తలేదు. యాసంగిల ధాన్యాన్ని కేంద్రమే కొనాలి.
మోదీ పగబట్టినట్లు చేస్తుండు..
బచ్చన్నపేట, డిసెంబర్ 23: రైతులంటే ప్రధాని మోదీకి ఇంత వివక్షనా.. ఆర్నెల్లు కష్టపడి వడ్లు పండిస్తే కొనేందుకు ముందుకు రాకపాయే. తెలంగాణ రైతులు దేశంకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగితే సంతోష పడాల్సింది పోయి పగబట్టినట్లు చేస్తుండు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుబిడ్డ అయినందున వారి గోస ఆయనకు తెలుసు. అందుకే రైతులను మంచిగ సూసుకుంటాండు. కేంద్రం తీరు మారాలే.. లేకుంటే రేపటి ఎన్నికల్లో గట్టిగ బుద్ధి చెప్తరు.
కేంద్రంది సవతి తల్లి ప్రేమ
నర్సంపేట, డిసెంబర్23: తెలంగాణ రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. వడ్లను కొనుగోలు చేయడంలో పూర్తిగా మోదీ చేతులెత్తేసిండు. యాసంగి పంట ధాన్యం కొనమని కేంద్ర మంత్రులు పదేపదే చెబుతున్రు. అన్నదాతలతో ఆటలాడుతాండు. దీంతో ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్రు. ధాన్యం కొంటమని హామీ ఇవ్వకుండా దాట వేస్తున్రు. వెంటనే దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలి. రైతులను అవస్థలకు గురి చేయొద్దు.
రైతెట్ల బతుకుతడు?
ములుగు,డిసెంబర్23(నమస్తేతెలంగాణ): కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనకుంటే రైతు అనేటోడు ఎట్ల బతుకుతడు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేలా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవాలె. ధాన్యాన్ని కొనబోమని చెప్ప డం ఎంత వరకు కరెక్టు. వడ్లను కొని రైతుకు న్యాయం చేయాలి. నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగనే దొడ్డు వడ్ల కొనుగోలులో కూ డా రైతులకు ప్రభుత్వాలు, అన్ని పార్టీల నాయకులు అండగా నిలువాలె.
రైతులంటెనే గిడుతలేరు..
నర్సంపేట, డిసెంబర్23: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రైతులంటెనే గిడుతలేరు. రైతులు కష్టం చేసి వడ్లను పండిస్తే పట్టనట్లు ఉంటాంది. బాధ్యతగా నడుచుకోవాల్సింది పోయి ఇష్టమున్నట్లు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తాంది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే మోదీ గద్దె దిగాలి. ఇప్పటికైనా వడ్లను కొంటామనే హామీని ఇవ్వాలి. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి రైతులు గట్టిగ బుద్ధి చెబుతరు.
కేంద్రమే కొనాలి
పాలకుర్తి డిసెంబర్23: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి. రైతు వ్యతిరేక విధానాలను వీడాలి. కేంద్రంలో బీజీపీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడమే కాక ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెపుతరు. ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలి.
ఇక్కడ ఎందుకు కొనరు?
నర్సింహులపేట, డిసెంబర్ 23: రైతులంటే దేశమంతటా ఒక్కటే. ఓ రాష్ట్రంలో పండించిన పంటలు కొంటరు. ఇక్కడ పండించిన పంటలు కొనరెందుకు? ఇంత వివక్ష మంచిది కాదు. వడ్లు వద్దంటే చాలా మంది రైతులు బాధపడుతరు. నాకు చెరువు కింద ఉన్న ఐదెకరాల్లో ఏ పంట వేసుకోవాలె. భూములు బీడుగా ఉంచుకోవాలా?
భూములను బీడుగా ఉంచుకోవాల్నా..
నర్సింహులపేట, డిసెంబర్ 23: చెరువు కింద వరి తప్ప ఇతర పంటలు పండించడం వీలు కాదు. లేకుంటే బీడుగా ఉంచుకోవాల్నా. వరి పండించే రైతులు ఎట్ల బతుకాలే. వానకాలమైనా, యాసంగైనా మాకు అవసరం లేదు. ఏ సీజన్ల పండించిన వడ్లనైనా కేంద్రం కొనాలే. ఇసొంటి వివక్ష చూపితే రైతుల ఉసురు తగులుతుంది.
ఇప్పుడేం మాయరోగం
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం మొండిపట్టు వీడుతలేదు. ఎనుకటి నుంచే ఎఫ్సీఐ ద్వారా కేంద్రమే ధాన్యం కొంటుంది. ఇప్పుడేం మాయ రోగం వచ్చింది. దేశాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ చెప్తున్నడు. కానీ వ్యవసాయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. వ్యవసాయం లేనిదే దేశం లేదని గొప్పలు చెప్పే నాయకులు తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాలని మాత్రం మాట్లాడుతలేరు.
-ముత్యాల రవీందర్, పెంచికల్పేట, ఎల్కతుర్తి
కొనకుంటే తీవ్ర నష్టం
మాకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నయ్. మేము వరి తప్ప వేరే పంటలు పండించలేం. మా భూములు సైతం వరికే అనుకూలంగా ఉన్నాయి. మేము పండించిన ప్రతి గింజనూ ఎఫ్సీఐ కొనేలా కేంద్రమే చర్యలు తీసుకోవాలి. మేము ఎనుకటి నుంచే పండిస్తున్న వరి విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదు.
ఎట్ల బతకాలె
కేంద్రం వడ్లు కొననంటాంది. రైతులెట్ల బతకాలె. ఆరుగాలం కష్టపడితిమి. వడ్లు పండిస్తిమి. ఇప్పుడేమో కొంటలేదాయె. గిట్లజేస్తే మోదీ ప్రభుత్వాన్ని ఎవలైన నమ్ముతరా?. కేంద్రంల ఒకరికి మించి మరొకరు వత్తాన్రు. మాటలు చెప్పుడే తప్ప రైతులకు సేవ జేసేటోళ్లయితే లేరు.
-వల్లెపు రాజయ్య, విశ్వనాథకాలనీ, భీమదేవరపల్లి మండలం
ఎంతో సంతోషపడ్డం
వానలు మంచిగపడ్డయ్.. నీళ్లు మంచిగస్తున్నయ్.. పంట మంచి పండుతాందని సంతోషపడ్డం. మా సంతోషం ఎంతోకాలం నిల్వలే. కరువు నేల మీద వానలు దండిగ పడ్డయ్. భూమిని చదును చేసి వడ్లు పండించినమ్. ఇప్పుడు వడ్లు కొననే కొనమని కేంద్రం అనుడు ఏం న్యాయం? సీఎం కేసీఆర్ సారే రైతుల గురించి మంచిగ ఆలోచిస్తున్నడు. మాకు అండగ ఉండి మాకోసం కేంద్రంతోని కొట్లాడుతున్నడు.