ఆడపిల్ల పట్ల లోకం తీరు ఏమైనా మారిందా? అవే నిందలు. అవే అవమానాలు. అవే అనుమానాలు. చిన్నప్పుడెప్పుడో ‘ఆడపిల్లనమ్మా’ అని పాడిన మధుప్రియ.. ఇప్పుడూ ‘ఆడపిల్ల బతుకు అరిటాకు చందం’ అని పాడుతూనే ఉందంటే.. పరిస్థితి ఏం మారినట్టు?
డిజిటల్ యుగంలోనూ ఆడపిల్లల పరిస్థితిలో మార్పులేదు. అన్ని రంగాల్లో రాణిస్తున్నా, అవమానాలు తప్పడం లేదు. చిన్నప్పటి నుంచే ఆడజన్మపై పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నది పెద్దింటి మధుప్రియ. ఆడపిల్ల పాటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి సమాజాన్ని ఆలోచింపజేస్తున్న మధుప్రియ మనసులోని మాట ఈవారం ‘ఫోక్స్టార్’
నేను అష్టమినాడు పుట్టిన. అందరూ ‘శెవ్వా’ అన్నరు. ‘అయ్యో మల్లా ఆడిపిల్లనేనా?’ అని చీదరించుకున్నరు. ఆడజన్మ నేరమెట్లవుతుందో నా చిన్ని బుర్రకు ఎక్కలేదు. అదే అష్టమి నాడు పిలగాడు పుడితే మాత్రం కృష్ణుడు పుట్టిండు అంటరు. ఈ చీదరింపులే నా పాటకు పల్లవైంది. అవమానాలే చరణాలైనయి. ‘ఆడపిల్ల ఆడాపిల్ల ఆడాపిల్లనటా నేను పాడూ పిల్లనటా’ అని ఏడుస్తూ పాడిన. ఆ పాట ప్రజల్లోకి వెళ్లి ఆలోచింపజేసింది.
మాది చాలా చిన్న కుటుంబం. నాన్న పెద్దింటి మల్లేశ్ సింగరేణి బాయిల పనిచేస్తడు. అమ్మ సుజాత. నాకొక అక్క సుప్రియ, చెల్లి శ్రుతిప్రియ ఉన్నరు. ఆదిలాబాద్ జిల్లా రామారావుపేట మా సొంతూరు. అమ్మమ్మ వాళ్లది ఇందారం. ఈ రెండూళ్లతోనూ మంచి అనుబంధం ఉంది. తాత, నాన్న, అమ్మ పాటలు పాడుదురు. వారసత్వంగా నాకు అబ్బింది. ‘చిన్న వయసులో పాట ఎలా రాసినవ్’ అని చాలామంది అంటుంటరు. కండ్లముందు కనిపించిన దృశ్యాలనే పాటగా మలిచిన.
నాకంటూ ఓ గుర్తింపు వచ్చినంక స్కూల్లో, బర్త్‌డే ఫంక్షన్లలో పాడటం మొదలుపెట్టిన. హైదరాబాద్‌కు వస్తే మెరుగైన అవకాశాలు ఉంటయి అని ఐదో తరగతిలో సిటీ వచ్చినం. బాగా ఉన్నోళ్ల బాత్రూమ్ అంత చిన్నగా ఉండేది మా ఇల్లు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకరి కాళ్లు ఒకరికి తాకుతుండేవి. ‘ఎప్పుడు తెల్లారుతదిరా దేవుడా’ అనిపించేది. అంత చిన్న జీవితం కాబట్టే ప్రతీ అనుభవం నాతో పాటలు పాడించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా సత్తా ఏంటో నిరూపించుకున్న.
చిన్న వయసులోనే మధుప్రియ అంటే ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నా. ఇదంతా నా తల్లిదండ్రుల చలవే. మేం ఆడపిల్లలం అనే భావన తల్లిదండ్రులు ఏర్పడనీయలేదు. ఈ 23 ఏండ్ల జీవితంలో నా కెరీర్ ప్రతీ మలుపులోనూ నాకు తోడుగా ఉన్నరు. నేను గర్వంగా చెప్పే విషయం ఏంటంటే అమ్మానాన్నలే నా బలం. నాకే కాదు ప్రతి ఒక్కరికీ అమ్మానాన్నలే బలం. గుర్తించడంలో మనం ఆలస్యం చేస్తాం.
‘ఆడపిల్ల’ పాట ద్వారా నా ప్రస్థానం మాటీవీ సూపర్ సింగర్ వరకూ వెళ్లింది. నిజంగా చెప్తున్నా ఆ వేదికే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటికే నేను ‘ఆడపిల్ల’ పాటను వేర్వేరు వేదికలల్లో పాడినప్పటికీ సూపర్ సింగర్ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ స్పందన నాలో మరింత కసి, బాధ్యత పెరిగేలా చేసింది. ఒక్కసారి హైదరాబాద్ చూస్తే చాలు అనుకున్న నేను ప్రపంచ దేశాల వేదికల్లో ‘ఆడపిల్ల గొంతు’ను వినిపించేటట్లు చేసింది.
ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఒక్కో మెట్టు ఎక్కుకుంటా వచ్చిన. నాకు తెలిసి నామీద పడినన్ని రాళ్లు ఇంకెవరి మీద కూడా పడలేదనుకుంటా. అదేందో ఏమో విచిత్రంగా ఎదుగుతుంటే ఓర్సుకోరు. ఆడపిల్ల సక్సెస్‌ను చూసి మెచ్చుకోరు. నేను గొప్ప విజయాలను చూసిన. దరిద్రమైన పరిస్థితులను కూడా చూసిన. సక్సెస్ వస్తే ఆస్వాదించిన తప్పితే ఎగిరి దుంకలేదు. కిందపడిన ప్రతిసారీ పాఠం నేర్చుకున్నా. కష్టపడి పేరు సంపాదించుకున్నా. ఆ విలువ నాకు తెలుసు. ఆ పేరును నిలబెట్టుకోవడమూ తెలుసు.
నా పాట ప్రయాణం విజయవంతంగా సాగుతున్నది. ఇప్పుడు యూట్యూబ్ చానెల్ పెట్టిన. తాజాగా ‘ఆడపిల్ల బతుకు అరిటాకు చందం’ పాట విడుదల చేసినం. మంచి స్పందన వస్తున్నది. గద్దర్ గారు రాసిన ‘తెచ్చీ పెడితే తిని కూసుంటవ్’ పాటకూ మంచి ఆదరణ లభిస్తున్నది. స్కూల్ ఏజ్‌లోనే ఒక ప్రభంజనం సృష్టించిన. ఆడజన్మపై ఎవరూ తీసుకురానన్ని పాటలు తీసుకొచ్చిన. సినిమాలకు పాడిన. చిన్నతనంలోనే ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. నేను నా లక్ష్యాన్ని చేరుకున్న. ఇక ఏం చేసినా సమాజానికి ఉపయోగపడే పని పాటల ద్వారా చేయాలనుకుంటున్నా.
ఎప్పుడో చిన్నప్పుడు సూపర్ సింగర్ వేదికగా పాడిన ‘ఆడపిల్ల’ను చూసి, గుర్తుంచుకొని శేఖర్ కమ్ములగారు కాల్ చేయడం, దిల్‌రాజుగారి ఆఫీస్ నుంచి పిలుపు అందడం నాకు పెద్ద టర్నింగ్ పాయింట్. అలా ఫిదా సినిమాలోని ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ పాట పాడిన. అశోక్ తేజగారు రాసిన ఈ పాట నన్ను వరించడం నిజంగా అదృష్టమే! ఎందుకంటే, నేను జనం మెచ్చిన జానపదాలు పాడిన. సామాజిక గీతాలు వినిపించిన. సినిమాలకూ పాడిన. కానీ, వాటన్నిటికన్నా మంచి పేరును, గుర్తింపును తీసుకొచ్చిన పాట ఇది. మధుప్రియ సినిమాలకు పాడుతుందని నాకొక్కదానికే తెలుసు. ఈ పాట తర్వాత అందరికీ తెలిసింది. ఇది నాకు మైల్‌స్టోన్‌గా నిలిచింది.
తెలంగాణ ఉద్యమంలో నా పాట ఎందరిలోనో ఉత్సాహాన్ని నింపింది. నా చిన్నతనంలో గద్దర్ తాతతో కలిసి పాదయాత్ర చేసిన. కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఆడిపాడిన. పెద్దలతో కలిసి తిరగడం వల్ల తెలంగాణ గురించి తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈ గోసలుండవు, బాధలుండవు అని తెలిసి నా పాటనందుకున్నా. ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు కెరీర్‌ను డెవలప్ చేసుకున్నా. అలా యాంకరింగ్ చేసే అవకాశాలు చానా వచ్చినయి. సాక్షిలో యాంకర్‌గా చేస్తున్న సమయంలో కేసీఆర్‌గారిని కలిశాను. ‘మధూ.. మన చానల్ ఉంది కదా? దాంట్లో చేస్తే బాగుంటుంది కదా?’ అన్న కేసీఆర్‌గారి పిలుపుమేరకు రాజ్‌న్యూస్ (టీన్యూస్)కి మారి యాంకర్‌గా చేసిన.
ఏ ఆడపిల్లయినా స్వతహాగా ఆర్థికంగా, సామాజికంగా ఎదగగలిగితే మనల్ని ఎవడూ టచ్ చేయలేడు. లైఫ్‌లో బాగా దెబ్బలు తిన్నాంక నమ్మిన సిద్ధాంతం ఇది. బయట ఇయ్యాల రేపు ఎవరినీ నమ్మొచ్చేట్టు లేదు. జీవితంలో అనుభవమైంది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా.
ఏ రాష్ట్ర ఆకాంక్ష కోసం ‘ధూమ్‌ధామ్’ వేదికల్లో ఆడి పాడిన్నో ఆ తెలంగాణ రానేవచ్చింది. తెలంగాణ గడ్డమీద పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. అప్పటి నుంచి కూడా నేను ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నా పాటను వినిపిస్తూనే ఉన్నా. నేను బాజాప్తా చెప్పుకొనే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న మాధ్యమాలేవీ లేనప్పుడే నేను నా పాటలను ప్రజలకు చేర్చిన. ఇంత హడావిడి ఏదీ లేకుండె అప్పుడు. కానీ, ఇప్పుడున్నంతగా సోషల్‌మీడియా, డిజిటల్ మీడియా అప్పుడు ఉండుంటే ఆ కథ వేరే ఉంటుండె. ఇప్పుడు ఫోక్ ట్రెండ్ నడుస్తుంది కదా! ఏ ట్రెండూ లేని టైంలో నేను ‘ఆడపిల్ల’, ‘ఆడజన్మ’, ‘ఎత్తుర ఎత్తు తెలంగాణ జెండా’, ‘ఆడపిల్లనమ్మా ఉయ్యాలో’ వంటి ఆల్బమ్స్ ఎన్నో చేసిన. ఎన్నో అద్భుతమైన జానపదాలు పాడి, ప్రజల మెప్పు పొందిన.
… దాయి శ్రీశైలం