సోమవారం 28 సెప్టెంబర్ 2020
Wanaparthy - Aug 13, 2020 , 03:32:28

ఇక ప‌క్కా.. పంచాయ‌తీ లెక్క‌

ఇక ప‌క్కా.. పంచాయ‌తీ లెక్క‌

n వార్షిక లెక్కలను పరిశీలిస్తున్న అధికారులు

n వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు..

n మొదటి విడుతలో 48 గ్రామాల ఎంపిక

n ఇప్పటి వరకు 13 జీపీల్లో పూర్తి

n పారదర్శక నిధుల వినియోగానికి శ్రీకారం

ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పుష్కలంగా నిధులను విడుదల చేస్తున్నది.. డబ్బులు పారదర్శకంగా 

వినియెగించుకుంటున్నారా లేదా అని తెలుసుకునేందుకు ఆడిటింగ్‌ నిర్వహిస్తుంటారు.. ఇప్పటి వరకు 

మాన్యువల్‌గా ఆడిటింగ్‌ నిర్వహించిన అధికారులు.. ఈ ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా ఆడిటింగ్‌ చేపడుతున్నారు.. 

నిధులు పక్కాగా వినియోగించేందుకు ప్రభుత్వం ఈ ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.. వనపర్తి జిల్లాలో 255 

గ్రామ పంచాయతీలు ఉండగా, ఆగస్టులో 48 పంచాయతీల్లో ఆడిటింగ్‌ చేయనున్నారు.. వీటిలో 

ఐదుగురు సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి ఇప్పటివరకు 13 జీపీల్లో పూర్తి చేశారు..

- వనపర్తి, నమస్తే తెలంగాణ

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ విధానం..

ఇప్పటివరకు ప్రతి పంచాయతీకి చేరుకొని మాన్యువల్‌గా ఆడిటింగ్‌ చేసిన అధికారులు ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు జీపీలో ఖర్చు చేసిన నిధుల బిల్లులు, రశీదులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వీటిన్నింటినీ మేనేజ్‌మెంట్‌ బుక్‌లో నమోదుచేసి, వాటిని స్కాన్‌చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. మాన్యువల్‌ రిపోర్ట్‌లో జనరల్‌ఫండ్‌, ఎస్‌ఎఫ్‌సీ, 14 ఫైనాన్స్‌, 15 ఫైనాన్స్‌లకు సంబంధించి ఆదాయ, వ్యయాలు నమోదు చేస్తారు. ఓపెనింగ్‌, క్లోసింగ్‌ బ్యాలెన్స్‌ల వివరాలు స్పష్టంగా పొందుపరుస్తారు. ఈ వివరాలను ఆడిటింగ్‌ అధికారి ఆన్‌లైన్‌లో పరిశీలించి.. అనుమానం వచ్చిన బిల్లుకు సంబంధిచిన ప్రశ్నలను పంచాయతీ కార్యదర్శికి ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. వీటికి సంబంధించిన సమాధానాలను పంచాయతీ కార్యదర్శి తిరిగి ఆన్‌లైన్‌లోనే ఇస్తారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆడిటింగ్‌ అధికారి జిల్లా అధికారులకు వివరాలను అందించగా, వాటిని ఆమోదించి తిరిగి ఆన్‌లైన్‌లోనే ఫైనల్‌ రిపోర్ట్‌ను అందిస్తారు. 

13 పంచాయతీల్లో పూర్తి చేశాం..

వనపర్తి జిల్లాలో ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభించాం. మొదటి విడుతలో 48 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి, ఇప్పటివరకు 13 గ్రామాల్లో ఆడిటింగ్‌ పూర్తి చేశాం. ఐదుగురు సిబ్బంది రెండు రోజులకు ఒక పంచాయతీకి చొప్పున ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటగా 25 శాతం పంచాయతీలను ఎంపిక చేసి ఆన్‌లైన్‌ ప్రక్రియను ప్రారంభించాం. వీటిలో లోటుపాట్లు, సమస్యలు పరిశీలించి మిగిలిన పంచాయతీల్లో కూడా నిర్వహిస్తాం. మొదటి సారి ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నాం. కాబట్టి మాన్యువల్‌గా కూడా రికార్డులను పరిశీలన చేపడుతాం.

- బీమ్లా, 

వనపర్తి 

జిల్లా 

ఆడిటింగ్‌ 

అధికారి

గ్రామపంచాయతీలకు అందిస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏడాది వార్షిక బడ్జెట్‌ వివరాలను మాన్యువల్‌గా ఆడిటింగ్‌ చేసే అధికారులు.. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. విడుతల వారీగా జీపీలను ఎంచుకొని వార్షిక లెక్కలను పరిశీలిస్తున్నారు. మొదటి విడుతలో 25 శాతం గ్రామాలను ఎంచుకొని వాటిలో లోటుపాట్లు, సమస్యలు గుర్తిస్తున్నారు. ఆ తర్వాత వాటన్నింటినీ సరిచేసి మిగతా జీపీల్లో ఆడిటింగ్‌ చేయనున్నారు. ఈ ఏడాది ఖర్చు చేసిన నిధులను మాత్రమే ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్న అధికారులు.., వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో మంజూరైనవి, ఖర్చు చేసినవి, మిగిలిన నిధులను మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయించి ఆడిటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ విధానం ద్వారా గ్రామ పంచాయతీల నిధులు దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ఖర్చుకానున్నాయి. 

48 జీపీల్లో 

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌..

ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు గ్రామాల వారీగా నిధులు వివరాలను పంచాయతీరాజ్‌ ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. వనపర్తి జిల్లాలోని 255 జీపీల్లోని నిధులు, ఖర్చుల వివరాలన్నింటినీ అధికారులు పీఆర్‌ యాప్‌లో పొందుపరిచారు. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ద్వారా తొలిసారిగా ఆడిటింగ్‌ నిర్వహిస్తుండటంతో అధికారులు ప్రతి జిల్లాలో 25 శాతం పంచాయతీలను ఎంపిక చేశారు. ఆగస్ట్‌ నెలలో వనపర్తిలోని 48 పంచాయతీల్లో ఆడిటింగ్‌ నిర్వహించనున్నారు. రెండు బృందాల్లో మొత్తం ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆడిటింగ్‌ ప్రారంభించిన అధికారులు.., ఇప్పటివరకు 13 పంచాయతీల్లో పూర్తి చేశారు. 

క్షేత్రస్థాయిలో పరిశీలనలు..

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ విధానం ద్వారా పంచాయతీ నిధుల వినియోగాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలించే అవకాశాలు ఉంటాయి. గతంలో ఆడిటింగ్‌ అధికారి, పంచాయతీ అధికారి, పాలకవర్గం సభ్యుల సమక్షంలో వ్యయాలను పరిశీలించి పనిపేరు, విలువ, ఖర్చు చేసిన నిధులను రికార్డులో మాత్రమే నమోదు చేసేవారు. నూతన విధానంతో మండల, జిల్లా స్థాయి అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యులు కూడా వివరాలను పరిశీలించేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియతో క్షేత్రస్థాయిలో పంచాయతీల్లో ఖర్చు చేసిన నిధులు వివరాలు ఉన్నతాధికారులకు సులభంగా తెలిసే అవకాశాలున్నాయి. నిధులు దుర్వినియోగం జరిగితే వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. 


logo