గురువారం 04 మార్చి 2021
Vikarabad - Jan 02, 2021 , 00:09:46

కల సాకారం

కల సాకారం

  • ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీచేయడంపై వెల్లువెత్తిన సంబురాలు 
  • ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

కులకచర్ల, జనవరి 1:  చౌడాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో స్థానిక గ్రామాల ప్రజలు సంబురాలు చేసుకుంటు న్నారు. కులకచర్ల మండలం నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలంగా ఉండేది. గతంలో 29 గ్రామ పంచాయతీలుగా ఉన్న మండలంలో 100కు పైగా తండాలు ఉండేవి.  కులకచర్ల మండల కేంద్రానికి రావాలంటే మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం దగ్గర ఉన్న చాకల్‌పల్లి, మరికల్‌ పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మండల పరిధిలోని మరికల్‌ పరిసర గ్రామాలు చాకల్‌పల్లి, కొత్తపల్లి, కన్మన్‌కల్వ, మరికల్‌, మల్కాపూర్‌ గ్రామాలతో పాటు తండాలను నవాబ్‌పేట్‌ మండలంలో విలీనం చేశారు. దీంతో అప్పట్లో కులకచర్ల మండలం నుండి ఐదు గ్రామ పంచాయతీలు పోగా 24 గ్రామ పంచాయతీలు ఉండేవి.  ప్రభుత్వం తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా  చేయడంతో కులకచర్ల మండలంలో మరో 20 తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం కులకచర్ల మండలంలో 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా కులకచర్ల మండల కేంద్రానికి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడాపూర్‌ పరిసర గ్రామాల ప్రజలు, నాయకులు తమకు   ప్రత్యేక మండలం కావాలని అప్పట్లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే కొత్త మండలం చౌడాపూర్‌ను చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం కూడా కొత్త మండలం చేయాలని అధికారులను ఆదేశించడంతో ఉన్నతాధికారులు మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

చౌడాపూర్‌ మండల పరిధిలోకి రానున్నగ్రామాలు 

కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్‌ కొత్త మండలంలో రెవెన్యూ గ్రామాలు లింగంపల్లి, అడవివెంకటాపూర్‌, విఠలాపూర్‌, చౌడాపూర్‌, మందిపల్‌, వీరాపూర్‌, మక్తవెంకటాపూర్‌ రెవెన్యూ గ్రామాలు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలంలో విలినమైన రెవెన్యూ గ్రామాలు పుర్సంపల్లి, మల్కాపూర్‌, కొత్తపల్లి, మరికల్‌, కన్మన్‌కల్వ, మొగుల్లపల్లి, చాకల్‌పల్లి రెవెన్యూ గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేయనున్నారు. 


VIDEOS

logo