ఆదివారం 17 జనవరి 2021
Vikarabad - Nov 25, 2020 , 04:12:09

వారంలోగా రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

వారంలోగా రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

పెద్దేముల్‌ : మండలంలో ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతువేదికల నిర్మాణపనులను వారం రోజుల్లోగా పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సంబంధిత ఏజెన్సీలవారిని ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని గోపాల్‌పూర్‌, మంబాపూర్‌, కందనెల్లి, ఇందూర్‌, పెద్దేముల్‌ తదితర గ్రామాల్లో పర్యటించి రైతువేదికల, క్రిమిటోరియం, కం పోస్టు షెడ్డుల నిర్మాణ పనులను పరిశీలించారు. తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 97 రైతువేదికలు మంజూరు కాగా అందులో 73 పూర్తయ్యాయని, మిగతా 24 రైతువేదికలు పేయింటింగ్‌ దశలో ఉన్నాయన్నారు. అయితే మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతువేదికలను నిర్మాణ పనులు చేపడుతున్న ఏజెన్సీలవారు నిర్మాణపరంగా ఉన్న పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని, పనులు పూర్తి చేసినవారు పేయింటింగ్‌ పనులు చేపట్టాలని, వారంరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఇంకా పూర్తి కాని క్రిమిటోరియం, కంపోస్టు షెడ్డు నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి బాధితుల నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా ఎవరూ వసూలు చేయడానికి వీలులేదని చంద్రయ్య అన్నారు. మంగళవారం తాసిల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీచేసి ధరణి పోర్టల్‌లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌ల వివరాలపై బాధితులు, సిబ్బందితో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ల, ఫీజుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అందులో భాగంగా రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు? ఏ రోజుకు ఆ రోజు రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తున్నారా? నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ డబ్బులు ఏవైనా తీసుకొంటున్నారా? స్లాట్‌ బుకింగ్‌లు ఎక్కడ చేయిస్తున్నారు? మీసేవా వారు ఎన్ని డబ్బులు తీసుకొంటున్నారు? అనే విషయాలను అడిగి తెలుసుకొని ఫీజుల వివరాలతో కూడిన ఓ బోర్డును కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని తాసిల్దార్‌ శ్రీనివాస్‌ను ఆదేశించారు.

 అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ అన్ని మండలాల్లో వేగంగా కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్‌లు చేసుకోవాలనుకున్నవారు నేరుగా మీ సేవా కేంద్రంలో అన్ని వివరాలు అందించి స్లాట్‌ బుకింగ్‌లు చేసుకొని అందులో నిర్దేశించిన ఫీజులు చెల్లించి, పట్టాపాసుపుస్తకాలను పొందాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు శ్రావణ్‌, విజయమ్మ, రాములు, మోహన్‌రెడ్డి, పద్మ, మండల ఎంపీడీఓ లక్ష్మప్ప, ఆర్‌ఐ రాజురెడ్డి, ఏపీఎం నర్సింహులు ఉన్నారు.