సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 01:11:48

మీ ఇంటికొస్తారు మిద్దెపై తోట పండిస్తారు

మీ ఇంటికొస్తారు మిద్దెపై తోట పండిస్తారు

మీ ఇంటికొచ్చి.. మిద్దెలపైన.. బాల్కనీల్లో తోటలు సాగు చేసి.. తాజా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తే.. అంతకంటే ఆరోగ్యభాగ్యం మరొకటి ఉండదు.. ఈ ఆలోచనతోనే ఆవిర్భవించి.. నగరంలో వేయికి పైగా మిద్దె తోటలు సాగు చేసింది హోంక్రాప్‌ సంస్థ.. విత్తునాటిన నుంచి పంట చేతికొచ్చే వరకు నిర్వహణను చూసుకుంటూ.. విస్తీర్ణాన్ని బట్టి రుసుం వసూలు చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నది.

  • నగరవాసులతో ‘వ్యవసాయం’ చేయిస్తున్న ‘హోంక్రాప్‌ అంకుర’ నిర్వాహకులు
  • వేయికి పైగా భవనాలపై కూరగాయల సాగు
  • విత్తిన నాటి నుంచి పండే వరకు నిర్వహణ వారిదే
  • విస్తీర్ణాన్ని బట్టి ధరలు.. నెలనెలా పరిశీలన

మణికొండ, నమస్తే తెలంగాణ : మన ఇంటికొచ్చి.. ఇన మిద్దె పైనే తోట సాగుచేస్తారు. విత్తునాటిన నుంచి పంట చేతికొచ్చే వరకూ నిర్వహణ చూసుకుంటారు.. విస్తీర్ణాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు.. మన కూరలు మనమే పండించుకున్నామనే సంతృప్తిని అందిస్తారు. మిద్దె సాగుకు చాలా మందికి తీరిక ఉండకపోవచ్చు. ఉన్నా అంత ఓపికా ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే ‘హోంక్రాప్‌ అంకుర’ సంస్థ ముందుకు వచ్చింది. మీ ఇంటికే వస్తాం..ఇంటి మిద్దెపైనే ఖాళీ స్థలంలో మీకు నచ్చిన పంటలను అందిస్తామంటున్నారు. పండించాలన్న ఉత్సాహం ఉన్నా..  సమయం, తీరిక లేనివారి కోసం వినూత్న ప్రయత్నంగా ఉన్నత విద్యావంతులైన ఐదుగురు స్నేహితులు హోంక్రాప్‌ పేరిట నగరంలో వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా ఇంటి మిద్దెలపై సేంద్రియ పంటలను పండిస్తూ ఆదర్శ ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. మరో అడుగు ముందుకేసి  ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లో సేంద్రియ వ్యవసాయ తరగతులను నిర్వహిస్తుండటం విశేషం. 


సేంద్రియ ఎరువులతో..

ఇంటి ముందు గార్డెన్‌, బాల్కనిలలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు,  ఆకుకూరలను పండించేందుకు వీలుగా, కాలాలకు అతీతంగా, ప్రతికూల వాతావరణంలో మొక్కలు పెరిగేందుకు అనుకూలంగా హోంక్రాప్‌ ప్రత్యేకమైన సంచులను తయారుచేసింది. జియో టెక్స్‌టైల్‌ ఫ్యాబ్రిక్‌ బ్యాగులను రూపొందించింది. వంకాయ, టమాట, బీరకార, నిమ్మకాయ మొక్కలను పెంచేందుకు ఇజ్రాయెల్‌ నుంచి హై ఇంపాక్ట్‌ పాలిస్టిక్‌ సంచుల్లో కొబ్బరి పొట్టు, వర్మీకంపోస్టును వినియోగించి పంటలు పండిస్తున్నారు. ఈ మిశ్రమం అవసరమైన మొక్కలకు కావా పోషకాలను అందిస్తుంది. ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు ఏపుగా పెరిగేందుకు వీలుంటుంది. ఈ బ్యాగులు అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. బ్యాగులకు నిర్ణీత రుసుమును వసూలు చేసి మిద్దెలపై కూరగాయలను పెంచుతున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ధరలను నిర్ణయించి మిద్దెలపై మొక్కల పెంపకం చేపడుతున్నారు. వినియోగదారుల ఇంటి వద్దకు నెలనెలా వచ్చి పంటలను పరిశీలిస్తున్నారు.


ఎరువులు..మందులు లేకుండా..

 కరీంనగర్‌ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి, అజయ్‌, మన్వితారెడ్డి, షర్మిలారెడ్డి, సాయికృష్ణారెడ్డి ఐదుగురు స్నేహితులు.. ఉన్నత విద్యను అభ్యసించి వినూత్నమైన ఆలోచనతో సేంద్రియ ఎరువులతో  పంటలను పండించి నగర వాసుల ఆహార కష్టాలను తీర్చాలని సంకల్పించారు. ఇందుకోసం ఏడాది పాటు శ్రమించి వ్యవసాయం, మిద్దె సాగుపై అధ్యయనం చేసి పట్టణంలో పల్లె పంటలను పండించేందుకు శ్రీకారం చుట్టారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించని సేంద్రియ ఎరువులతో  మహా నగరంలోని పెద్ద పెద్ద బంగ్లాలపై ఉన్న ఖాళీ స్థలాలే తమ వ్యవసాయ భూములుగా గుర్తించి పంటలను పండిస్తున్నారు. అందు కోసం ‘హోంక్రాప్‌ అంకుర’ పేరిట సంస్థను స్థాపించారు. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లో కొంత మంది తమ ఇంటి మిద్దెలపై కూరగాయలను పండిస్తున్న విషయం తెలిసిందే. కానీ పండించుకోవాలన్న ఆలోచన ఉన్నా.. సమయం లేక చాలామంది ఆచరణలో పెట్టకుండానే నిరుత్సాహానికి గురవుతుంటారు. అందుకు హోంక్రాప్‌ సంస్థ  చేయూతనిస్తూ మిద్దెలపై సేంద్రియ ఎరువులతో నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నగర వాసుల ఆహార కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో వినూత్న రీతిలో మిద్దె సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలో దాదాపు వెయ్యి ఇండ్ల మిద్దెలపై హోంక్రాప్‌ సంస్థ ఆధ్వర్యంలో మిద్దెపై పంటలను పండిస్తున్నారు. దీంతో పాటుగా పాఠశాలల్లో విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్న సంకల్పంతో ఈ ఏడాది కొన్ని పాఠశాలలను ఎంపిక చేసుకొని సాగు అవగాహన తరగతులను నిర్వహిస్తున్నారు.


 ‘స్కూల్‌ క్రాప్‌'తో శిక్షణ..

విభిన్న ఆలోచనలతో మిద్దెలపై సాగును విస్తరిస్తూనే...భవిష్యత్‌ తరాలకు వ్యవసాయంపై పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. హోంక్రాప్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో కూరగాయలు, ఆకు కూరల పెంపకంపై హోంక్రాప్‌ బృందంతో  సురంపూడి రామకృష్ణ ‘స్కూల్‌ క్రాప్‌' తరగతులను నిర్వహిస్తున్నారు. 


ఆరోగ్యవంతమైన  సమాజం కోసమే.. 

పురుగుల మందులు.. ఎరువులతో విషతుల్యమైన కూరగాయలు రోగాలు మోసుకొస్తున్నాయి.  మనమే పండించుకుని తింటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. మనకు నచ్చిన కూరగాయలను మనమే పండించుకొనే అవకాశమున్నా చాలా మందికి సమయం లేకపోవడంతో రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇంట్లోనే పండించుకునేందుకు ఇంటి బాల్కని, మిద్దెలపై ఉన్న ఖాళీ స్థలాల్లో  హోంక్రాప్‌ సంస్థ  మీ ఇంటికే వచ్చి మీకు నచ్చిన కూరగాయలను పండిస్తుంది.

-అజయ్‌, హోంక్రాప్‌ సంస్థ  వ్యవస్థాపకుడు


logo