ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jan 27, 2020 , 05:23:36

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నేడే

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నేడే
  • మున్సిపల్‌ ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధం
  • మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • ఒక్కో మున్సిపాలిటీకి ఒక ప్రత్యేక అధికారి నియామకం

పరిగి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 22న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగగా 25న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు రావడంతో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా పరిధిలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 11గంటలకు గెలుపొందిన వార్డు కౌన్సిలర్లతో  ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకుగాను జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి ఒక ఆథరైజ్డ్‌ ఆఫీసర్‌ నియామకం చేపట్టారు. పరిగి మున్సిపాలిటీకి జిల్లా రెవెన్యూ అధికారి మోతీలాల్‌, వికారాబాద్‌కు ఆర్‌డీవో వెంకటఉపేందర్‌రెడ్డి, తాండూరుకు ఆర్‌డీవో వేణుగోపాలరావు, కొడంగల్‌కు జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానను ఆథరైజ్డ్‌ అధికారులుగా నియమించారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఉదయం 11గంటలకు కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఒక్కో వార్డు కౌన్సిలర్‌ చొప్పున ప్రతిజ్ఞ చేపడుతారు. 


తెలుగు అక్షరమాల క్రమంలో పేర్లలోని మొదటి అక్షరం ఆధారంగా కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్‌ చైర్మన్లు, అనంతరం వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. చైర్మన్‌ అభ్యర్థి పేరును ఒక సభ్యుడు ప్రతిపాదించాలి, వారిని మరో సభ్యుడు బలపరచాలి. ఒక్కరే రంగంలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. పోటీలో ఇద్దరు ఉన్నట్లయితే చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల్లో ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక తర్వాత వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. సంబంధిత మున్సిపాలిటీలోని సగం మంది సభ్యులు హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణించడం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల సోమవారం చైర్మన్‌ ఎన్నిక జరుగకుంటే మరుసటి రోజు మంగళవారం ఎన్నిక నిర్వహిస్తారు. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆయా వార్డుల కౌన్సిలర్లకు కేటాయించిన కుర్చీలపై వారీ వార్డు నెంబర్లను అతికించారు. తద్వారా వారికి కేటాయించిన సీట్లలో ఆయా వార్డుల కౌన్సిలర్లు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆయా మున్సిపాలిటీ కార్యాలయాల్లోని సమావేశ మందిరాల్లో ఏర్పాట్లను ఆథరైజ్డ్‌ అధికారులు పర్యవేక్షించారు. 


నాలుగు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌వే...

జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరాయి. ఇందుకుగాను చైర్మన్ల ఎన్నిక లాంఛనమేనని చెప్పొచ్చు. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ మున్సిపాలిటీలను స్పష్టమైన మెజారిటీతో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం జరిగే ఎన్నికలో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ తరపున పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో చైర్మన్ల పేర్లు నిర్ణయించారు. పరిగిలో చైర్మన్‌గా ముకుంద అశోక్‌, కొడంగల్‌కు జగదీశ్వర్‌రెడ్డి పేర్లు నిర్ణయించడం జరిగింది. వికారాబాద్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి చిగుళ్లపల్లి మంజులరమేష్‌కుమార్‌, పుష్పలతారెడ్డిలలో ఒకరికి, తాండూరు చైర్‌పర్సన్‌ స్థానానికి దీపనర్సింహులు, తాటికొండ స్వప్నలలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఈ మేరకు వికారాబాద్‌, తాండూరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్ల పేర్లను సోమవారం ఉదయం వరకు ప్రకటించే అవకాశం ఉన్నది. ఇదిలావుండగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్ల పేర్లను సోమవారం ఉదయం వరకు నిర్ణయించనున్నారు. సోమవారం మధ్యాహ్నం చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు పూర్తవుతాయి. 


logo