Vasthu Shastra | ‘నాస్తిక వాదం’తో చూస్తే వాస్తు తప్పు అని మా నాన్న అంటున్నారు. ఏది నిజం?
– క్యూ. అమృత రావు, దిల్సుఖ్నగర్
ఈ సమాజంలో ఎన్నో ‘వాదాలు – వివాదాలు’ చోటుచేసుకుంటున్నాయి. మనుషులంతా అనాగరికమైన, అవాస్తవికమైన నాటకీయ జీవితాలకు అలవాటుపడుతున్న వ్యవస్థలో ఉన్నారు. సృష్టి ‘సత్యమైన గర్భం’లోకి వెళ్లి చూసే శక్తిని – యుక్తిని ఈ మనిషి చేజార్చుకుంటున్నాడు. నేలమీద ఉన్న జీవుల్లో నవ్వగలిగే.. మాట్లాడగలిగే ప్రాణి మానవుడు ఒక్కడే. కానీ, అతడే అలవాట్లకు, అవసరాలకు బానిసగా మారి, కేవలం ‘పుట్టి.. చచ్చే’ ప్రక్రియలో ‘బిజీ’గా గడిపేస్తున్నాడు. విశ్వాత్మ విధివిధానాలు.. మనిషిలోని అనంతమైన ‘గెలుపు శక్తి’ని వెలికి తీయడానికి ఎన్నో మార్గాలను ఏర్పరచి పెట్టాయి. నీళ్లు తాగాలంటే.. ప్రతిసారీ బావిలోకే దూకాలనే ఆలోచన కలిగేవాళ్లు.. పరిమితంగానే ఆలోచిస్తారు. ‘వాస్తు లోపలికి’ వెళ్లనివారి మాటలు మనకు అనవసరం.
మాది పడమర ఇల్లు. నైరుతి మెట్ల కింద గది ఉంది. అక్కడ బరువు ఉండాలని కట్టాం. మంచిదేనా?
– కె. శ్రీధర్, కొత్తూరు
మీకు మీరు నిర్ణయం తీసుకొని నైరుతి మెట్ల ల్యాండింగ్ కింద స్టోర్ గదిని కట్టి, మళ్లీ ఎందుకు సందేహిస్తున్నారు? అంటే, మీలోనే ఏదో అనుమానం ఉంది. ‘కరెక్టో.. కాదో..’ అన్న సంశయం వేధిస్తున్నది. ముందు ఆ మెట్ల కింద స్టోర్ గది తీసేయండి. ఆ గదిలో కొందరు టాయిలెట్ కూడా పెడుతుంటారు. నైరుతి అనగానే చాలామంది ‘ బరువు మోసేది’ అనే అనుకుంటారు. అక్కడ తప్పక బరువు పెట్టాలని ఇలా కడుతుంటారు. శరీరంలో తల.. బరువు మోయగల అవయవం. అవసరం అయినప్పుడు మాత్రమే అది బరువును మోస్తుంది. అంతేగానీ, తలమీద ఎప్పుడూ ఏదో ఒక మూట (బరువు) పెట్టుకొనే తిరగాలా? కొన్ని దిశలు కొన్ని సందర్భాల్లో బరువు మోయలేవు. నైరుతి మెట్లు వచ్చాక నైరుతి భాగం ఎత్తు – పొడవు అనే కొలమానం.. దాని వైశాల్యం, వాడే విధానం లెక్కకు వస్తాయి. ఆ కోణంలో దక్షిణం – పడమర నైరుతి మెట్ల ల్యాండింగ్ కింద గదులు అసలు పనికిరావు.
సింహద్వారానికి రెండు వైపులా కిటికీలు పెట్టుకోవాలా? ఒకవైపు పెట్టుకోవాలా?
– బి. కృష్ణమోహన్, మోర్తాడ్
సింహద్వారాన్ని ఇంటి హాలుకు మధ్యలో పెడితే మీరు కోరుకున్నట్లు ద్వారానికి రెండు వైపులా కిటికీలు పెట్టుకోవచ్చు. అంటే, హాలు తూర్పు – పడమరగా వస్తే తూర్పు మధ్యలో.. హాలు ఉత్తరం – దక్షిణంగా వస్తే ఉత్తరం మధ్యలో రెండు వైపులా కిటికీలు ఉన్న ద్వారం కుదురుతుంది. దానికి ఎదురుగా.. అటు దక్షిణం కానీ, పడమర కానీ నిష్క్రమణ ద్వారం వస్తుంది. శుభంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఈశాన్యం ద్వారాలు కూడా పెడుతున్నారు. అప్పుడు ఇంటి మొత్తానికి ఈశాన్యం గదికి ఉత్తరం గోడను ఆనుకొని ప్రధాన ద్వారం వస్తుంది. అప్పుడు ద్వారంతోపాటు కిటికీ మాత్రమే ఉంటే దానికి ఎదురుగా వచ్చే ద్వారం ఆయా గదులకు ఉచ్ఛ దిశలో చక్కగా అమరుతాయి. పారు తప్పకుండా జాగ్రత్తగా కొలతలు చూసుకోవాలి. మీరు నిర్ణయించుకున్న దిశను బట్టి ద్వారం – కిటికీలు చేయించుకోండి. ఎక్కడ ద్వారం వచ్చినా మిగతా ద్వారాల నడక వక్రం కావద్దు.
మా ఇంటి గోడలు వంకరగా పెరిగి ఉన్నాయి. ఏం చేయాలి? దీని ఫలితాలు ఎలా ఉంటాయి?
– పి. సత్యం, ఆలేరు
ఏ ముఖద్వారమో చెప్పలేదు మీరు. ఏ మూలలు పెరిగాయో రాయలేదు. ఉత్తరం ప్రధాన ద్వారం ఉండి తూర్పు గోడ.. ఆగ్నేయంగా పెరిగి ఉంటే.. ఉత్తరం గోడ వాయవ్యంగా పెరిగితే.. అవయవ లోపాలున్న సంతానం కలుగుతుంది. మతిస్థిమితం కోల్పోయి.. కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను హింసకు గురిచేసే మగ సంతానం లభిస్తుంది. అలాగే, ఇంటి ఈశాన్యం.. అంటే తూర్పు-ఉత్తరం తగ్గి, నైరుతి దిశలో గోడలు తగ్గి ఉండి, ద్వారాలు వక్రదిశల్లో పెట్టి ఉంటే.. ఆ గృహ సభ్యుల మధ్య అగాథం ఏర్పడుతుంది, శత్రుభావన పెరుగుతుంది. శరీరంలోని ఒక భాగంలో లోపం వల్ల.. శారీరకంగా, మానసికంగా ఒళ్లంతా అస్థిరత ఏర్పడినట్టే, ఇల్లు విషయంలోనూ ఇబ్బంది కలుగుతుంది. ఆ ప్రభావం కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుంది. ఇంటి పెద్ద నుంచి ప్రతి ఒక్కరూ కష్టాల పాలు అవుతారు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?
Vasthu Shastra | స్థలానికి వాస్తు ఉందా లేదా అన్నది ఎలా చూడాలి?
Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
Vasthu Shastra | మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?
వాస్తు | ఇంటిముందు వరండాకు కానీ గుండ్రటి పిల్లర్లు వేయవచ్చా? దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా?