Vaasthu Shastra | తాజ్‌మహల్ సమాధి కదా? దానికీ వాస్తు ఉంటుందా?
– ఎం. సంధ్య, రామన్నపేట
దాని వైభవం అదే. తాజ్‌మహల్‌ను చూస్తున్నప్పుడు అదొక సమాధి అనే విషయమే గుర్తురాదు. వాస్తవానికి తాజ్‌మహల్ ఒక గొప్ప వాస్తు నిర్మాణం. అందుకే, ఇప్పటికీ లక్షల సంఖ్యలో ప్రపంచ పర్యాటకులను తనవైపు తిప్పుకొని, సమ్మోహన పరుస్తున్నది. ఒక చతురస్ర ప్రాంగణంలో చక్కని చతురస్ర పీఠంమీద తాజ్‌మహల్ నిర్మితమైంది. డబ్భు రెండు మీటర్ల ఎత్తయిన ఆ భవనం దక్షిణ ముఖంగా చాలా గొప్పగా కుదిరింది. దానికి ఉత్తరాన యమునా నది ఉంది. దక్షిణ భాగం ఎత్తుగా, ఉత్తర భాగం పల్లంగా.. సరైన దిశతో అమరి ఉన్నాయి. ఆ నిర్మాణం చూసి దిక్సూచిని కూడా సవరించుకోవచ్చు. అంత గొప్పగా దిశలను చూపెట్టగలదు. చక్కని కొలనులు, కాలువలతో శాస్త్రానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నది.
మేము ఇటీవలే ఉత్తరంవైపు కొత్త ఇల్లు కట్టాం. దక్షిణం ఇల్లు అలాగే ఉంది. అలా ఉండొచ్చా? ఇది వాస్తు విరుద్ధమని అంటున్నారు.
– ఎస్. భద్రయ్య, వేములవాడ
అప్పటికే ఒక ఇల్లు ఉండగా మరో ఇంటిని ఉత్తరం వైపు కట్టినప్పుడు.. దక్షిణం ఇల్లు ప్రశ్నార్థకం అవుతుంది. ఇది గృహస్తు జీవితంపైనా ప్రభావం చూపుతుంది. కొత్త ఇల్లు పెద్దది. అది ఉత్తరంలోకి మారితే దక్షిణ భాగం, ఉచ్ఛమైన భాగం ఏం చేస్తారు? దానిలో ఎవరుంటారు? ఇలాంటప్పుడు ఉన్న ఇంటిని తొలగించి, మొత్తం స్థలంలో ఇంటిని ప్లాన్ చేసుకోవాల్సింది. మీ చిన్న ఇంటికి, పెద్ద ఇంటికి సందు ఉంది కాబట్టి పెద్ద ఇల్లు (ఉత్తర భాగం) వేరుచేస్తూ.. ప్రహరీ కట్టండి. చిన్న ఇంటిని అమ్మేయండి. ఇద్దరికీ తూర్పు రోడ్డు వస్తుంది కాబట్టి బాగుంటుంది. దక్షిణం ఇల్లు ఇతరులది కాకపోతే.. అటు అందులో ఉండలేక, ఇటు ఉత్తరం గృహం ఉనికిని కోల్పోయి నానా అవస్థలు పడుతారు. ఇలాంటి ఇండ్లు పల్లెల్లో ఎన్నో కనిపిస్తాయి.
నిత్య జీవితంలో పంచాంగంతో పనేమిటి?
– వై. సోమయ్య, జగిత్యాల
॥ తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే
కార్యాకార్య వ్యవస్థితౌ ॥
మనిషి ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అనేది శాస్త్రమే మనకు కచ్చితంగా చెబుతుంది. మనం చాలా విషయాలలో అశక్తులం, అజ్ఞానులం అనే విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ క్షణం మనది. మరుక్షణం ఏమో.. మనకు తెలియదు. కాబట్టి మన భద్రతకు, మంచి భవిష్యత్తుకు పంచాంగం ఒక కాలసూచిగా ఉంటుంది. పంచాంగం అంటే.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలతో కూడిన శాస్త్రం. అది వ్రతం, నియమం, ఉద్వాసన, ఉపవాస, దీక్షా విధానాలను, కాలసూచిని, కాల స్వభావాన్ని అంటే.. మనిషి కర్మల ఫలంతో వచ్చే భవితను తెలుపుతుంది. మన విపరీత భావాలను శాస్త్రానికి జోడించి చూడవద్దు. మిడిమిడి జ్ఞానంతో పంచాంగాన్ని పరిహాసం చేయడం తెలివి అనిపించుకోదు. ఎన్నో తరాలు పంచాంగాన్ని అనుసరిస్తూ వస్తున్నాయి. పాటించడం, పాటించకపోవడం అనేది వ్యక్తిగతం. కానీ, పనికిరాదు అనడం మూర్ఖత్వం. శాస్త్రాన్ని మనం వడపోయాల్సిన అవసరం లేదు. వడపోసిన తరువాతనే అది శాస్త్రంగా నిలబడుతుంది. యోగ్యమైన అన్నాన్ని (ఆహారాన్ని) తిరిగి పరిశోధించాల్సిన అవసరం ఉండదు. సేవించడమే! యోగ్యత ముందే ఏర్పడి ఉంది కదా! మన బుద్ధి చెప్పినట్టు శాస్త్రాలు నడవవు. మనం వాటిని అనుసరించాలి. ‘నా బుద్ధి చెప్పినట్టు నడుస్తాను’ అంటే.. ఆ బుద్ధే నీ గమ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. అది సుగతో, దుర్గతో చివరికి తెలుస్తుంది. అక్కడ సవరింపులకు అవకాశం ఉండదు. తెలిసే వరకే తెల్లారిపోతుంది.
పడక గదిలో ఫాల్స్ సీలింగ్ ఎలా వేసుకోవాలి?
– వి. శ్రీధర్, మేడ్చల్
ఫాల్స్ సీలింగ్‌కు శాస్త్రబద్ధత అంటూ లేదు. కానీ, దానిని బీముల మాదిరిగా కిందికి ఎక్స్పోజ్ అయ్యేలా వేయవద్దు. పడక ప్రాంతం అంటే.. బెడ్ దగ్గర కిందికి దిగినట్టు ఉండేలా ఫాల్స్ సీలింగ్ వేయవద్దు. బెడ్ స్థానం మీద ప్లెయిన్‌గా ఉంచుకొని.. గది చివర్లకు స్టెప్స్‌తో ఫాల్స్ సీలింగ్ వేసుకోవడం మంచిది. కొందరు ఇనుప గొట్టాలు, వేలాడే దీపాలు (శాండ్లియర్లు) వేస్తుంటారు. అవన్నీ కలత నిద్రకు గురిచేస్తాయి. నిరంతర భూమి ఆకర్షణ శక్తి కారణంగా పైన వేలాడదీసినవన్నీ కిందికి దూకేలా ప్రభావం పొందుతుంటాయి. వాస్తవానికి అవేం కిందపడవు. కానీ, ఆ ప్రభావం శరీర అవయవాల మీద.. ముఖ్యంగా మెదడు మీద పడుతుంది. అలాంటి నిర్మాణాలు లేకుండా చూసుకుంటే చాలు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?