– కె. ఆంజనేయులు, సికింద్రాబాద్.
చాలామంది వారివారి ఆర్థిక స్థితి, అవసరాలు, ఇంటి సభ్యుల మనస్తత్వాలు.. ఇలా ఎన్నో కారణాలతో ఇంటిని విభజించి.. ఇలా రెండు, మూడు, నాలుగు ముక్కలుగా కత్తిరించి వాడుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద దోషం. ఎవరు ఎక్కడ ఉంటారు? ఉండాలి.. అనేది చాలా చిన్న ప్రశ్న. కానీ, అలా ఒక్క ఇంటిని చించి.. నాలుగు ముక్కలు చేసి వాడొచ్చా? అనేది ముందు ఆలోచించాలి. ఇలా చేసిన కుటుంబ సభ్యులలో ఒకరికి ఈశాన్యం మూల ఇల్లు. మరొకరికి ఆగ్నేయం మూల.. అలాగే నైరుతి, వాయవ్యం మూలల ఇండ్లు వస్తాయి. ఇందులో ఒక్కో మూల ఉన్న ఒక్కో కుటుంబం.. ఒక్కో రకమైన పరిస్థితులను పొందుతుంది.
అది చాలా విపరీతంగా ఉంటుంది. ఈశాన్యం భాగం వాళ్లు ఆనందంగా ఉంటే.. నైరుతి భాగం వాళ్లు చాలా నష్టాలతో, ఆరోగ్య సమస్యలతో జీవితం సాగిస్తారు. ఆగ్నేయ భాగంలో ఉండే కుటుంబం విపరీతమైన టెన్షన్స్‌తో, ఆడపిల్లల సమస్యలతో బాధపడుతుంది. వాయవ్యం భాగంలోని కుటుంబం.. మానసిక వేదనలతో పరస్పర విరుద్ధ భావాలతో జీవిస్తుంది. ఇలా కేవలం అవసరాల కోసం ఇంటిని నాలుగు ముక్కలు చేయడంకన్నా.. అందరూ కలిసి అదే ఇంటిమీద పైకి అంతస్తులు పెంచుకుంటూ.. ఒక్కొక్కరు ఒక్కో అంతస్తులో ఉండటం శ్రేయోదాయకం. లేదా ఇల్లు మొత్తాన్నీ ఒక్కరికే అప్పగించి.. మిగతా వాళ్లు అద్దెకు వెళ్లడం శ్రేష్ఠం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
– బి. పద్మనాభం, గుండాల.
కడగొట్టు ఇల్లు ఊరిలో కట్టకూడదని గతంలో అనేవారు. ఇది రక్షణకు – భద్రతకు సంబంధించిన మాట. ఊరి చివర, అడవికి, ఇతర జంతుజాలం తదితర ప్రమాదాలు అనేవి దీనిలోని అంశం. అలాగే, పొలిమేర వద్ద ఊరికి దూరంగా ఇల్లు ఉండకూడదు అనడంలో మరొక ధార్మిక అంశం.. ఊరిని కాపాడే గ్రామ దేవత ఊరిని రక్షిస్తూ ఉంటుంది. ఆమె ప్రయాణదారిలో ఇండ్లు, తదితర నిర్మాణాలు చేయరాదు అనేవారు పెద్దలు. ఇప్పటికీ గ్రామ దేవతలు మన ఊళ్లలోనే ఉంటారు. వారికి ఏటా పూజలు చేస్తారు. ఆ కోణంలో మన సంప్రదాయవాదులు చెప్పిన మాట అది. ఏది ఏమైనా.. ఊరిలో ఇళ్లతోపాటుగా ఇల్లు కలిసి ఉండటాన్నే శాస్త్రం అంగీకరిస్తుంది. పొలిమేర గృహాన్ని కట్టకపోవడమే మంచిది.
– కె. వీణాపాణి, మారేడుపల్లి.
మన శరీరానికి పడని మత్తు పానీయాలు ఇంట్లో పెట్టుకుంటే దోషం లేదు కానీ.. మహాభారత గ్రంథాలు పెట్టుకుంటే దోషమా? మానవ సమాజానికి.. మన భారతదేశానికి మాత్రమేకాదు, సమస్త ప్రపంచానికీ విజ్ఞానపు గవాక్షం.. మహాభారతం. చాలామంది ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ, అసలు ధర్మాధర్మాల లోతులను, వాటి సూక్ష్మతను తెలిపే పంచమవేదం.. మహాభారతం. ఒక వ్యక్తి నడతను, కుటుంబ విధానాన్ని, సమాజ ధర్మాన్ని, రాజు బాధ్యతలను, దేశ ధర్మాన్ని, విశ్వ ధర్మాన్ని సైతం విడమరిచి అందించేది ఈ నేలమీద ఏదైనా ఉందా అంటే.. అది వ్యాస భారతం ఒక్కటే! ఈ ప్రపంచంలో ఎన్ని విధానాలు ఉన్నా.. అవన్నీ చర్చించేది, తద్వారా వాటివాటి ఫలితాలు చూపించేది ఆ గ్రంథం ఒక్కటే! అది కేవలం అన్నదమ్ముల మధ్య వచ్చిన పంచాయితీ (దాయాదుల గొడవ) కాదు.
అందుకే పెద్దలు నిర్వచించారు దానిని.. భారతంలో ఉన్నది మరోచోట ఉండవచ్చు. కానీ, భారతంలో లేనిది మరోచోట ఉండదు అని. కాబట్టి, ఇంట్లో ఆ గ్రంథం ఉండటం ఒక భాగ్యం. ఒక ఆత్మశక్తి. వ్యక్తుల పురోభివృద్ధికి మూల సంపద అవుతుంది. ఎవరో ఏదో తెలిసీ తెలియక అనే వెర్రి మాటలు మనం పట్టించుకోవద్దు. భారత రామాయణ భాగవత గ్రంథాలు గృహాలలో తప్పకుండా ఉండాల్సినవి. అప్పుడే ఆ ఇంటికి సనాతన ధర్మ సంపద అందుతుంది. జన్మలు సార్థకం అవుతాయి. రాబోయే తరాలు సైతం తీర్చిదిద్దబడుతాయి. మీరు చక్కగా మీ ఇంట్లో మహాభారత పద్దెనిమిది పర్వాల వాల్యూమ్స్ అమర్చుకోండి. నిత్యం అధ్యయనం చేయండి. సకల శుభాలు కలుగుతాయి.
– కె. పరమేశ్వరి, భువనగిరి.
బావి ఇంటిలోపలి భాగంగా ఉండటం మంచిదికాదు. ఇల్లు స్వచ్ఛందంగా ఏ గోతులు, నూతులు లేకుండా ఉండాలి. బావులు స్వతఃసిద్ధంగా, శాస్త్రబద్ధంగా ఇంటి బయట కాంపౌండు లోపల ఉచ్ఛమైన స్థలాలలోనే ఉండాలి. అది మంచినీళ్ల బావి అయినా సరే.. ఇంటిలో నిషేధం. మీరు ఆ బావి తూర్పులోనే ఉంది అంటున్నారు. అప్పుడు ఆ బావి కావాలి అనుకుంటే.. తూర్పులోని బావి ఉన్న భాగం కలుపుకొని ఇంటి ముందు ఇల్లు తొలగించి.. బావిని బయటికి జరపండి. అంటే.. బావి ఉన్న స్థలాన్ని ఓపెన్ చేయాలి. తద్వారా తూర్పు ఖాళీ స్థలం ఏర్పడి, ఇంటి లోపలినుంచి బావి వేరుపడుతుంది. మిగతా ఇంటి భాగాన్ని తిరిగి కిచెన్, హాల్, ఈశాన్యం గది.. ఇలా వాస్తుకు తగ్గట్టుగా సవరించుకోండి. అలా బావి దక్కుతుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143