– కె. పరమేశ్వరి, ఉప్పల్.
జాతక బలం ఎలా ఎన్నా.. వాస్తు బలమైనా గృహస్తును కాపాడుతుందని ఇంటికి ఒక ప్రణాళికను రూపొందించారు మన పెద్దలు. మన జన్మ.. మన ప్రణాళికతో ఉండదు. రాదు. కాబట్టి, జన్మకు ముందు చేసిన కార్యాలు (కర్మలు), వాటి ఫలితాలను ఆపలేం. ఆగవు. కాబట్టి, జాతకంలోనూ నివారణోపాయాలు ఉంటాయి. తద్వారా కర్మఫలాల తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంటి వాస్తులోనూ అంతే! శాస్త్రబద్ధమైన గృహం, ధర్మబద్ధమైన జీవితం వల్ల వ్యక్తి దోషాలు అడుగంటి.. జీవిత ప్రయాణం ఒడుదొడుకులు లేకుండా ప్రకృతి అండతో అభివృద్ధికరమైన ఆలోచనలతో ముందుకు సాగుతాడు. మన గతం మనకు తెలియదు. కానీ, వర్తమాన జీవితం సక్రమంగా ఉంటే.. భవిష్యత్తు భయం ఉండదు అనేది శాస్ర్తాల అంతరంగం. మనిషి కేవలం భౌతిక పదార్థంగా కాకుండా, బయటికి తెలియని ఒక సూక్ష్మ శరీరం కలిగిన గొప్ప స్వభావశీలి అనేది మరిచిపోవద్దు. మనలో అంతరంగ విశ్వం ఒకటి ఉంది.
వ్యక్తి మీద, గృహం మీద గ్రహాల ప్రభావం, సూర్య మండలం ప్రభావం తప్పకుండా ఉంటాయి. మనం అంతా సూర్యుడి తేజో మండలంలో జీవిస్తున్న వాళ్లం. కాబట్టి, మన ఆలోచనల ప్రపంచం మనం జీవిస్తున్న సూర్య చంద్రులు, గ్రహాలపైనా ఆధారపడి ఉంటుంది. ఏ విశ్వాత్మ ఏర్పరచిన చట్టంతో అవి సంచరిస్తున్నాయో.. అదే చట్ట పరిధిలో మానవుడి శరీరం, అవయవాలు నడుస్తున్నాయి. లేకుంటే మనం పడుకుంటే.. గుండె ఆగిపోతుంది. ప్రాణ స్పందన నిలువదు. ఇదంతా ప్రకృతి ప్రణాళికలో ఉంటుంది. మని చుట్టూరా విశ్వాత్మ శక్తి వలయం అలుముకొని ఉంది. అది సదా మన మనో శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి జాతకం – వాస్తు అనేవి మనిషిని నడిపించడానికి, తన నిర్దిష్టమైన జన్మ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టిన ఆచరణ శాస్ర్తాలు. వాటిని అనుసరించడమే మనం చేయాలి. వాటిపై అపోహలు అనవసరం.
– కె. శ్రీధర్, షాద్నగర్.
ఇంటికి రెండు రోడ్లు రావడం ఎప్పుడూ మంచిదే! అంతేకాదు. మూడు రోడ్లు కూడా ఉండవచ్చు. ఆ రోడ్లు తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు కానీ.. ఉత్తరం, పడమర రోడ్డు కానీ.. లేకుంటే, తూర్పు – దక్షిణం, దక్షిణం – పడమర రోడ్డు ఉండవచ్చు. అంతేకాకుండా.. తూర్పు రోడ్డు దానికి అభిముఖంగా పశ్చిమం రోడ్డు రావచ్చు. రోడ్లు రెండు వచ్చినప్పుడు అవి బ్లాకుగా మారతాయి. అయితే ఆ బ్లాకులలో ఏది ప్రధాన వీధిగా (రాజవీధిగా) ఉందో చూసుకొని దానిని సింహద్వారం చేసుకొని ఇల్లు కట్టాల్సి వస్తుంది. వెంటిలేషన్ అధికంగా రావడానికి రెండు వీధులు చాలా దోహదపడతాయి. అయితే, రోడ్లు వాటి దిశలు, వాటి నడకలు, వాటి ఎత్తు వంపులు అన్నీ గమనించి ఇల్లు ప్లాన్ చేసుకోవాలి.
– బి. వంశీ, మాదన్నపేట.
ఇంటికి నైరుతి భాగం ఎత్తు ఉండాలి. ఈశాన్యం పల్లం ఉండాలి.. అని అందరిలో బాగా నాటుకుపోయింది. కానీ, ఎంత పల్లం, ఎంత ఎత్తు అనే స్పష్టత ఎవరికీ ఉండటం లేదు. ఇంటి చుట్టూ ప్రదక్షిణ స్థలం లేకుండా.. ఇంటిని, కాంపౌండుకు కలిపి నైరుతిలో అడ్డంగా ఎత్తు దిమ్మను కట్టి.. పూర్తి నైరుతి లేకుండా చేస్తున్నారు. అది పెద్ద దోషం. ప్రదక్షిణ కట్ కావద్దు. నైరుతిలో అరుగు (దిమ్మ) వద్దు.
ఇంటి లోపల ఆవరణం కన్నా.. కాంపౌండు లోపలి ఆవరణం కింది ఉంటూనే నైరుతి నుంచి తూర్పు పల్లంగా, అలాగే పశ్చిమ నైరుతి నుంచి ఉత్తరం పల్లంగా.. అలాగే, వాయవ్యం నుంచి ఈశాన్యం, అటు దక్షిణ ఆగ్నేయం నుంచి ఈశాన్యం పల్లంగా.. ఇలా కొద్ది అంగుళాల డౌనుతో ఉండాలి. అంతేకానీ, నైరుతి ఎత్తు అని అరుగులు కట్టొద్దు. సొంత నిర్ణయాలు ఇంటి విషయాల్లో మంచిదికాదు. తెలుసుకొని కట్టాలి.
– డి. సురేశ్, గచ్చిబౌలి.
మన ఇంటికి చుట్టూ కాంపౌండు ఉన్న తరువాత పక్క ఇంటి వారి నిర్మాణాలతో మన ఎత్తులను పోల్చుకోవద్దు. పోట్లాడుకోవద్దు. ఎటు దిక్కు అయినా.. అధికమైన ఎత్తుగా ప్రహరీలు కట్టవద్దు. తద్వారా ఇంటిలో వెంటిలేషన్ తగ్గిపోతుంది. అలాంటి ఎత్తయిన ప్రాకారాలు రాజభవనాలకు, దేవాలయాలకు ఉంటాయి. వాటి ప్రయోజనం, నిర్మాణ విధానం వేరుగా ఉంటుంది.
కాబట్టి, మీ ఇంటికి తూర్పు అయినా, ఉత్తరం, ఈశాన్యం అయినా.. మనకున్న కాంపౌండు మీద కాకుండా.. వాళ్లది వాళ్లు ఎత్తుగా కట్టుకుంటే తప్పుకాదు. అయితే, మన ఇంటికి ప్రహరీలు లేనప్పుడు వాళ్లు ఇల్లు, వాళ్ల కాంపౌండులే మనకు హద్దు గోడలు అయితే దోషం. కాబట్టి ఎవరి ఇంటికి వారు హద్దుమీద కాంపౌండు చూసి కట్టుకుంటే చాలు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143