ఇంటి ఆవరణలో రేగు, తుమ్మ చెట్లు ఉండొచ్చా? – రేగు అమల, బొల్లారం
ఇంటికి, ప్రహరీకి మధ్య ఉన్న భాగమే గృహం బయటి ఆవరణ. దాని రూపు
రేఖలే మన మనసును ప్రభావితం చేస్తుంటాయి. పచ్చదనంతో కూడిన పరిసరాలు మనిషికి అంతర్గత శాంతిని పంచుతాయి. మన చుట్టూ ఉండే చెట్లు చిక్కటి ఆకులతో, నీడతో, గుబురైన మొక్కలతో, ప్రధానంగా, ఔషధ గుణాలతో ఉండాలి. రేగు, తుమ్మ, పలక జెముడు, బొమ్మ జెముడు మొదలైన ముండ్ల చెట్లను ఇంటి ఆవరణలో పెంచవద్దు. ఇల్లు వేరు, వ్యవసాయ క్షేత్రం వేరు. అయితే నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు పెంచుకోవచ్చు. దోషానికి మించి.. హాని చేసే లక్షణాలు ఉన్న మొక్కలు, చెట్లు ఆవరణలో ఏవీ ఉండవద్దు.
ఇంటికి, కాంపౌండుకు, రోడ్డుకు మధ్య ఎన్ని అడుగులు ఉండాలి?- వి.తార, చాదర్‌ఘాట్
స్థలంలో మీరు ప్లాన్ చేసిన దాన్ని బట్టి పశ్చిమం వదిలిన ఖాళీ కన్నా, మూడు రెట్లు తూర్పు ఎక్కువ ఉండటం మంచిది. అలానే రోడ్డు ఉత్తరంలో వస్తే ఆ దిశలో కూడా ఎక్కువ మొత్తం ఖాళీ వదులుకోవాలి. ఇంటిముందు ఇరుకు పెట్టొద్దు. ఇక ఇంటికి రోడ్డుకు మధ్య కొన్ని చోట్ల డ్రైనేజ్ లైన్లు, ఓపెన్ కాలువలు, మునిసిపల్ విభాగం నాటిన చెట్లు వగైరా ఉంటాయి. వాటికి సంబంధించి కొంత స్థలం నడిచే రోడ్డు భాగం (ఫుట్‌పాత్) కాకుండా ఎంతోకొంత వదలాల్సి ఉంటుంది. వీటికి కచ్చితమైన కొలతలు అంటూ ఉండవు. ఆయా ప్రాంతాల్లో ఉండే విధి విధానాలను బట్టి నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా, ఎడం పాటించడం మాత్రం అవసరం.
ఈశాన్యం బాగా పెరిగిన ప్రహరీకి గేటు ఎలా పెట్టాలి? అలా పెరగొచ్చా? – బి. రాజమల్లు, కోరుట్ల
ఇంటి అడుగు భాగం కంటే, ఈశాన్యం ఎక్కువగా పెరిగితే ఆలోచించాలి. చాలామంది ఈశాన్యం ఎంత ఎక్కువగా పెరిగితే, అంత లాభమని అనుకొంటారు. ప్రతి నియమానికి ఒక నిర్దిష్టమైన పరిధి ఉంటుంది. అతి, అపరిమితి ఏదీ గొప్పది కాదు. తలపై కిరీటమైనా మోయదగిన బరువులో ఉండాలి కదా! మీరు పంపిన నక్షలో ఉత్తర ఈశాన్యం చాలా కోణంగా పెరిగింది. అంత కోణంగా అవసరం లేదు. ప్రహరీ కట్టాక ప్రతి మూలకూ మన అడుగుపడేలా ఉండాలి. అప్పుడే అది ఫలదాయకం. మీరు తూర్పు కాంపౌండును ఆగ్నేయం మూలలో మూలమట్టానికి చేసి అలానే, వాయవ్యం మూలలో మూలమట్టంగా (90 డిగ్రీల కోణంలో) లైన్ చేసుకొని, కేవలం ఉత్తర ఈశాన్యం మాత్రమే పెంచుకోండి. కారణం మీది ఉత్తర వీధి గృహం. ఇక గేటును పెరిగిన గోడను అనుసరించి కాకుండా, ఉత్తరం చూసేలా పెట్టండి.
ఇంటి చుట్టూ అరుగు ఎంత వెడల్పు కట్టొచ్చు? దానిపైన స్లాబు రావాలా? – అనంతుల శంకర్, పెద్దపల్లి
గృహానికి చుట్టూ నడక వచ్చే ఖాళీ స్థలం విశాలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంటి చుట్టూ అరుగు వస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకునే మీరు ప్లాను చేసుకోవాలి. ఇంటి చుట్టూ నాలుగు నుంచి ఆరు అడుగుల వెడల్పు అరుగు చక్కగా ఉంటుంది. అయితే ఇంటి ఫ్లోర్ కంటే ఆరు అంగుళాలు దిగువకు అరుగును నిర్మించుకోవాలి. అరుగును ఆనుకునే విధంగా ప్రహరీ ఉండొద్దు. అరుగుకు, కాంపౌండుకు మధ్య కూడా నడిచే విధంగా చాలినంత ఖాళీ వదులుకోవాలి. ఆ అరుగు మీద స్లాబు వేసుకోవడం మంచిదే. దక్షిణ పడమరలో కూడా అవసరమైతే ఇంటి స్లాబ్‌తో పిల్లర్లు లేకుండా వేసుకోవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678