జీన్సుకి జిప్ వేయడం తెలుసు. కానీ చీరకు జిప్ వేయడం గురించి విన్నారా? ఏదైనా చిటికెలో అయిపోవాలి అనుకునే ఈ తరం అమ్మాయిలు తాము ప్యాంటు షర్టు వేసుకునేంత సమయంలోనే చీరలో సిద్ధమైపోవాలి అని కోరుకుంటున్నారు. ఇలా అనుకుంటే అలా జరిగిపోయే స్మార్ట్ యుగం కాబట్టి చీర కూడా జిప్ సెట్ గో… అన్నట్టు తయారైపోయింది. అదేనండీ… ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న ‘జిప్ అండ్ గో శారీ’ల గురించే మనం మాట్లాడుకుంటున్నది!
కొత్త తరానికి పాత మీద మోజేం పోలేదు. జీన్సులూ స్కర్టులూ వేసుకుంటున్నారు కాబట్టి చీరను మర్చిపోయారని అస్సలు అనుకోలేం. ఏ సందర్భానికి తగ్గట్టు ఆ డ్రెస్‌లో రెడీ అయిపోవడం అంటేనే వీళ్లకి ఇష్టం. అందుకే పెండ్లిళ్లు, గుళ్లూగోపురాలకు వెళ్లినప్పుడు అచ్చ తెనుగు చీరకట్టులో మెరిసిపోతుంటారు. ట్రెడిషనల్ డేలంటూ ఆఫీసుకూ కోక చుట్టి కేక పెట్టిస్తుంటారు. ఏతావాతా దీన్నిబట్టి అర్థం అయ్యేదేంటంటే, వాళ్లకి చీరమీద హేట్ ఫీలింగ్ ఏం లేదు. లవ్వున్నా తరచూ చూపించలేకపోతున్నారు. దానికి కారణం అయిదున్నర మీటర్లుండే ఆ వస్ర్తాన్ని అందంగా కట్టుకోవడం రాకపోవడమే! పాపం వీళ్ల ఇబ్బందిని గమనించిన డిజైనర్లు ఇప్పుడు జీన్సుకు పోటీగా చీరను తయారుచేశారు. అర నిమిషంలో రెడీ అయిపోయే ఈ చీరలు ‘జిప్ అండ్ గో శారీస్’ పేరిట ట్రెండ్ అవుతున్నాయి.
చిటికెలో…
పేరుకు తగ్గట్టే ‘జిప్ అండ్ గో శారీ’ అంటే జస్ట్ జిప్ పెడితే సిద్ధమైపోయే చీరే. మడత విప్పి చూస్తే ఇది గౌనులా కనిపిస్తుంది. అంటే, పైన ఉన్న బ్లౌజ్, కింద చీర కలిపి కుట్టేసి ఉంటాయన్న మాట. కుచ్చిళ్లు కూడా రెడీగానే ఉంటాయి. ఈ గౌనును తొడుక్కుని ఛాతీ దగ్గర ఇచ్చిన జిప్ పెట్టుకోవాలి. తర్వాత నడుం దగ్గర ఉన్న బటన్ని కూడా పెట్టేస్తే కుచ్చులు ఎదురుగా వచ్చేస్తాయి. ఇక వాటికి అనుబంధంగా ఉండే కొంగును తిప్పి భుజం మీదుగా వేసుకుంటే చీరకట్టు సిద్ధమైనట్టే. సిల్క్, కాటన్, జార్జెట్, షిమ్మర్… ఇలా సాధారణ చీరల్లో ఎన్నుకున్నట్టే వీటిలోనూ నచ్చిన రకాన్ని ఎంచుకోవచ్చు. చేతులు ఉన్నవే కాదు స్లీవ్‌లెస్ తరహాలోనూ ఈ చీరలు వస్తున్నాయి. జరీ అంచు చీరలూ, ఎంబ్రాయిడరీ బ్లౌజులతోనూ ఇవి తయారవుతున్నాయి. ఇంతకుమునుపు వచ్చే రెడీ టు వేర్ చీరల్లో నడుం దగ్గర హుక్ పెట్టి చీరను చుట్టి, జాకెట్ విడిగా వేసుకోవాలి. దానికి భిన్నంగా చీరా జాకెట్ రెండూ కలిపి ఉండి, జిప్ పెడితే సిద్ధమైపోవడం ఈ రకం ప్రత్యేకత. అదన్న మాట సంగతి. మరి చీరకు జిప్ వేసే ప్రయత్నం మీరూ చేస్తున్నారా?!
చిటికేసి చెప్పండి!