ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ అతికష్టం. రోడ్డు మధ్యలో నిల్చుని నిత్యం ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. డ్యూటీ టైం అయిపోయే సరికి వారి ఓపిక నశిస్తుంది. కానీ, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. నిరుపేద తల్లికిచ్చిన మాట కోసం ఆమె కొడుకుకు ట్యూషన్ చెబుతున్నాడు. డ్యూటీ అయిపోగానే కట్టెపట్టుకొని టీచర్ అవతారమెత్తుతున్నాడు. ఫుట్‌పాత్‌పైన విద్యార్థికి ట్రాఫిక్ కానిస్టేబుల్ చదువు చెబుతున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
సార్జింట్ ప్రకాశ్ ఘోష్..పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో సౌత్ఈస్ట్ ట్రాఫిక్ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అతడు విధులు నిర్వర్తించే స్థలంలోనే రోడ్డుపక్కన ఓ మహిళ స్ట్రీట్ ఫుడ్ విక్రయిస్తున్నది. ఇల్లులేకపోవడంతో ఫుట్‌పాత్‌పైనే కొడుకుతో కలిసి ఉంటున్నది. ఆమె కొడుకును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నది. కొడుకు చదవుపై శ్రద్ధపెట్టకపోవడంతో ఆ తల్లి మదనపడిపోయింది. పక్కనే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో చెప్పగా, అతడు రోజూ ట్యూషన్ చెబుతానని ఆ తల్లికి మాటిచ్చాడు.
రోజూ డ్యూటీ అయిపోగానే, ప్రకాశ్‌ఘోష్ నేరుగా ఆ బాలుడి వద్దకు వస్తాడు. ఆ రోజు హోమ్‌వర్క్ చెక్చేస్తాడు. పదాల ఉచ్చరణతోపాటు హ్యాండ్ రైటింగ్‌పై శిక్షణనిస్తాడు. ఓ ప్లాస్టిక్ కవర్‌పై బాలుడు పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు పెట్టుకొని కూర్చొని ఉండగా, చేతిలో కట్టెపట్టుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ చదివిస్తూ ఉండగా, ఎవరో ఫొటో తీసి, సోషల్‌మీడియాలో పెట్టారు. అప్పటినుంచీ ఈ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.