ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్డౌన్ల కారణంగా ఇంటర్నెట్ వాడకం, ముఖ్యంగా పిల్లల్లో మరీ ఎక్కువైంది. ఇలా తన పిల్లలు అర్థరాత్రి నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడపడం ఒక తండ్రికి నచ్చలేదు. పిల్లలకు ఎంత చెప్పినా వారు వినడం లేదు. దీంతో ఒక ప్లాన్ వేసిన అతను.. ఎవరికీ తెలియకుండా ఒక జామర్ తీసుకొచ్చాడు.
ఇంట్లో పిల్లలు త్వరగా పడుకుంటారనే ఆలోచనతో అర్థరాత్రి 3 గంటల వరకు ఇంటర్నెట్ పనిచేయకుండా చేశాడు. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. దాంతో జామర్ వల్ల ఆ ఒక్క ఇంటికే కాదు, మొత్తం ఊరు ఊరంతా ఇంటర్నెట్ ఆగిపోయింది. ప్రజలు నానా తిప్పలూ పడ్డారు. అసలు ఇంటర్నెట్ ఎందుకు ఆగిపోయిందో కూడా వారికి అర్థం కాలేదు. ఈ ఔటేజ్‌కు కారణం కనుక్కున్న ప్రభుత్వం సదరు తండ్రిపై కేసు నమోదు చేసింది.
ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఇక్కడ జామర్లు వాడటం చట్టరీత్యా నేరం. ఈ కారణంగా సదరు తండ్రిపై కేసు నమోదైంది. ఈ కేసులో అతనికి 30 వేల యూరోల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతను ఉపయోగించిన జామర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.