లక్నో: దేవత పార్వతీ దేవిగా చెప్పుకుంటున్న ఒక మహిళ భారత్, చైనా సరిహద్దులో ఉన్న హిమాలయాల్లోని నిషేధిత ప్రాంతంలో తిష్ఠ వేసింది. శివుడ్ని వివాహం చేసుకోవాలనుకుంటున్న ఆమె కైలాస పర్వతంలోని మానస సరోవర్కు వెళ్లే మార్గంలో నివశిస్తున్నది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు ఆమె నిరాకరిస్తున్నది. దీంతో ఆ మహిళను అక్కడి నుంచి బలవంతంగా తరలించేందుకు భారీగా పోలీస్ బృందాలను పంపారు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. లక్నోలోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ 15 రోజుల కిందట అధికారుల అనుమతితో కైలాస పర్వతంలోని మానస సరోవర్కు వెళ్లే మార్గమైన గుంజి ప్రాంతానికి తన తల్లితో కలిసి వెళ్లింది. అనంతరం భారత్-చైనా సరిహద్దులోని నిషేధిత ప్రాంతమైన అక్కడ ఆమె మకాం పెట్టింది.
మరోవైపు అధికారులు ఆ మహిళకు ఇచ్చిన 15 రోజుల అనుమతి గడువు మే 25తో ముగిసింది. దీంతో ఆమెను వెనక్కి తీసుకొచ్చేందుకు ముగ్గురితో కూడిన పోలీస్ బృందాన్ని ఆ ప్రాంతానికి ధార్చుల అధికారులు పంపారు. అయితే ఆమె వారికి షాక్ ఇచ్చింది. తనను తాను పార్వతీ దేవి అవతారంగా చెప్పుకుంది. కైలాసంలో కొలువైన శివుడ్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తనను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
దీంతో భయపడిన ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐతో కూడిన ముగ్గురు పోలీసుల బృందం ఉట్టి చేతులతో వెనక్కి వచ్చినట్లు ధార్చుల ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను ఎలాగోలా అక్కడి నుంచి తరలించేందుకు వైద్యులు, పోలీసులతో కూడిన 12 మంది బృందాన్నిశుక్రవారం అక్కడకు పంపినట్లు చెప్పారు. పార్వతీ దేవీగా చెప్పుకుంటున్న ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేనట్లుగా కనిపిస్తున్నదని వెల్లడించారు.