ఆ ఏరియాలో ఉబెర్ స్ట్రైక్ నడుస్తోంది. ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌ను కలువాల్సి ఉంది. అతడి వద్దకు ఎలా వెళ్లాలి అని బాగా ఆలోచించింది. ఆమెకు వెంటనే టిండర్ యాప్ గుర్తొచ్చింది. ఇది ఓ డేటింగ్ యాప్. ఇందులో తమకు కావాల్సిన వాళ్లతో పరిచయం పెంచుకుని, వాళ్లకు ఇష్టముంటే డేటింగ్‌కు వెళ్లొచ్చు. ఇంకేం సదరు యువతి ఓ అబ్బాయిని లైన్లో పెట్టింది. బయటకెళ్దాం రా అని పిలిచింది. దీంతో ఆ యువకుడు కారేసుకొని యువతి ఇంటివద్దకు వచ్చేశాడు. ఆ యువతి అతడి కారెక్కి రైడ్‌కు వెళ్లిపోయింది.
కొంతదూరం వెళ్లాక ఓ చోట కారు ఆపమని యువకుడిని కోరింది. అతడు వెంటనే ఆపాడు. తెలిసిన వ్యక్తికి ఓ వస్తువు ఇచ్చి వస్తా అని చెప్పి అక్కడే ఓ ఇంట్లోకి ఆమె వెళ్లిపోయింది. యువతి వస్తుందని సదరు యువకుడు చాలాసేపు వేచిచూశాడు. కానీ, ఎంతసేపైనా రాలేదు. ఇక లాభం లేదనుకుని వెళ్లి ఇంటి డోర్కొట్టాడు.
ఓ పొడువాటి వ్యక్తి బయటకు వచ్చి ఆ అమ్మాయి తన ఫ్రెండ్‌తో ఉంది..రాలేదు అని సమాధానమిచ్చాడు. అప్పటికిగానీ ఆ యువకుడికి మోసపోయానని తెలియలేదు. ఉబెర్ స్ట్రైక్ వల్లే నీతో డేటింగ్ అంటూ నాటకమాడానని యువకుడికి ఆ మరుసటిరోజు ఆ యువతి మెసేజ్ పెట్టింది. ఈ విషాద డేటింగ్ కథను సదరు యువకుడు రెడిట్‌లో పెట్టాడు. ఈ కథ చదివినవారంతా అయ్యో పాపం అని యువకుడిపై జాలిపడుతున్నారు.