ట్రిపుల్ బెడ్రూం ఇల్లేంటి.. ఫ్రీ ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే..ఈ ఇంటిని ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనక్కర్లేదు. అయితే, ఓ కండిషన్ ఉంది. ఈ ఇంటిని మాత్రమే ఇచ్చేస్తారు. అర్థం కాలేదా? ఈ ట్రిపుల్ బెడ్రూం ఇంటిని అమాంతం తీసుకెళ్లి మరోచోట పెట్టుకోవాలి. అలా ఇంటిని తీసుకెళ్లేవారు ముందుకొస్తే ఫ్రీగా ఇచ్చేస్తారన్నమాట.
ఈ అతిపురాతన, అందమైన ఇల్లు అమెరికాలోని కన్సాస్లోగల లింకన్‌లో ఉంది. దీన్ని 1910లో నిర్మించారు. ఇక్కడ లింకన్ కౌంటీ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ దవాఖాన కట్టాలని నిర్ణయించింది. అయితే, ఈ ఇంటిని కూల్చడం ఫౌండేషన్‌కు ఇష్టం లేదు. 2,023 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంలో ఉన్న ఈ ఇల్లు ఓ ఇంద్రభవనంలా ఉంటుంది. లోపల మొత్తం ఓక్, పైన్ వుడ్ తో నిర్మించి ఉంటుంది. కింద రాతి పునాది ఉంది. దీన్ని మరోచోట ఏర్పాటుచేసుకునే వీలుంది.
అందుకే ఈ ఇంటిని ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేయాలని ఫౌండేషన్ నిర్ణయించింది. ఈ మేరకు యాడ్ కూడా ఇచ్చింది. ఈ ఇంటిని తీసుకెళ్లాలనుకునేవారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఫౌండేషనే 30,000 డాలర్లు (రూ. 22.87 లక్షలు) ఇస్తుంది. ఒకవేళ ఎవరూ ముందుకురాకపోతే ఈ ఏడాది చివరివరకూ వేచిచూసి ఆ ఇంటిని కూల్చేయాలని ఫౌండేషన్ నిర్ణయించింది.