Viral Video | డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటివారిని అవమానపరుస్తూ.. లెక్కచెయ్యకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంటారు. చేతిలో డబ్బుంది కద.. ఏం చేసినా చెల్లుతుందిలే అన్న తలపొగరుతో ఉంటారు. తాజాగా చైనాలోని ఓ గ్యాస్ స్టేషన్ ఉద్యోగిని పట్ల కారు యజమాని అమర్యాదగా ప్రవర్తించిన తీరు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది.
బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి.. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో ఇంధనం నింపుకున్నాడు. అనంతరం డబ్బుమాత్రం అక్కడ ఉన్న మహిళా ఉద్యోగి చేతికి ఇవ్వలేదు. కిటికీలోంచి కిందకు విసిరేశాడు. దీంతో అక్కడున్న ఆమె సహనం కోల్పోకుండా.. ఆ డబ్బును తీసుకుని తన బ్యాగ్లో వేసుకుంటుంది. అనంతరం ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనతో అవమానంగా భావించిన ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇందుకు సంబంధించిన వీడియో రెడ్డిట్లో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కారు యజమానిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతని తీరుపై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అన్ని గ్యాస్ స్టేషన్లలో ఆ కారు ప్రవేశించకుండా నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.