రోడ్డు మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలని ఊరికే అనరు. వాహనం మీద వెళ్లినా.. నడుచుకుంటూ వెళ్లినా జాగ్రత్తగా వెళ్తుండాలి. ముఖ్యంగా పిల్లలను తీసుకొని రోడ్డు మీదికి వెళ్లినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అలా.. చాలా మంది చిన్నారులు రోడ్డు ప్రమాదాలకు బలైన వీడియోలు ఎన్నో చూశాం.
తాజాగా.. ఓ చిన్నారి బిజీగా ఉన్న రోడ్డు మీదికి పరిగెత్తుకుంటూ వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడే ఆ రోడ్డు మీద వేగంగా పెద్ద ట్రక్కు వెళ్తోంది. అదే సమయంలో చిన్నారి రోడ్డు మీదికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. అంతే.. వెంటనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని వెనక్కి లాగాడు. రెప్పపాటులో కన్నుమూసి తెరిసేలోగా ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. అతడు ఆ చిన్నారి వెంట పరిగెత్తడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ వీడియోను రెడిట్‌లో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే ఆ చిన్నారిని కాపాడిన వ్యక్తిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.