FIFA World Cup : ఖతర్‌తో పాటు యావత్ ప్రపంచమంతా ఫిఫా ఫైనల్ కోసం ఎదరుచూస్తోంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన అర్జెంటీనా, ఫ్రాన్స్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ యున్ను పోలిన వ్యక్తి కనిపించాడు. లూసెయిల్ స్టేడియం దగ్గర్లోని ఫ్యాన్ ఫెస్టివల్ దగ్గర ఉన్న అతడిని ఫొటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఆ వ్యక్తి పేరు హొవార్డ్ ఎక్స్. చైనా మూలాలు ఉన్న ఆస్ట్రేలియా పౌరుడు. ఖతర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తనకు ఆనందాన్ని పంచిందని హొవార్డ్ తెలిపాడు. గతంలో బ్రెజిల్, రష్యా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు తాను హాజరయ్యానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ నెల ప్రారంభంలో ‘2030లో ఉత్తరకొరియాలో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు లాబీయింగ్ చేయడానికి వచ్చాను’ అంటూ ఒక వీడియో విడుదల చేశాడు.
హొవార్డ్ వృత్తిరీత్యా సంగీత దర్శకుడు. ఉత్తరకొరియా అధ్యక్షుడిలాగా ఉండడంతో అతడిని తరచూ అనుకరిస్తూ ఉంటాడు. అలాగని కిమ్ జాంగ్ గురించి గొప్పగా చెప్పడం అతని ఉద్దేశం కాదు. కిమ్‌ను విమర్శిస్తూ, వ్యంగ్యంగా జోకులు వేసేందుకే కిమ్‌ను ఇమిటేట్ చేస్తానని హొవార్డ్ వెల్లడించాడు. ఇతను 2018లో పెయింగ్ చాంగ్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా చీర్ లీడర్స్‌ను కలిశాడు. దాంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.