న్యూఢిల్లీ: మదర్స్ డే నేపథ్యంలో ఒక అమ్మ ఇంటర్నెట్లో హీరోగా నిలిచింది. చేతులు లేకపోయినా తన కాళ్లతోనే బిడ్డకు సపర్యలు చేస్తూ ఆలనపాలన చూస్తూ హీరో మామ్‌గా పాపురల్ అయ్యింది. బెల్జియన్ కళాకారిణి సారా తల్బీ చేతులు లేకుండానే పుట్టారు. అయినప్పటికీ ఆమె ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లనే చేతులుగా చేసుకుని అన్ని పనులు చేసుకుంటున్నారు. ఆడ పిల్లకు జన్మనిచ్చిన సారా తల్బీ తన బిడ్డకు అన్ని పనులు కూడా కాళ్లతోనే చేస్తున్నది. వీరోచిత తల్లిగా నిలిచిన ఆమె గురించి మహిళా యూట్యూబ్ ఛానెల్లో రెండేళ్ల కిందట ఒక వీడియో పోస్ట్ అయ్యింది. అంగవైకల్యం ఉన్న ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె సూపర్ మమ్గా పేరు పొందింది. ఆమె తన కాళ్లతో చేసుకునే రోజువారీ పనుల వీడియోలు ఇప్పటికీ ఆ ఛానెల్లో అప్డేట్ అవుతుంటాయి.
కాగా, ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా మదర్స్ డే సందర్భంగా ఈ వీడియోను ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తల్లిని మించిన గొప్ప యోధులు లేరని చెప్పవచ్చు. ప్రేమ, స్ఫూర్తి, విలువలతో తమ పిల్లలను సమర్థులుగా తీర్చిదిద్దే తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు సారా తల్బీ తన పాపకు కాళ్లతోనే దుస్తులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది. ఇప్పటికే 62 వేల మందికిపైగా దీనిని వీక్షించారు. ఐదు వేల మందికిపైగా లైక్ చేశారు. చేతులు లేనప్పటికీ తన బిడ్డతోపాటు తనను తాను బాగా చూసుకుంటున్న హీరో మామ్‌ను నెటిజన్లు ప్రశంసించారు.
— Dipanshu Kabra (@ipskabra) May 8, 2022