ఎన్నికలు పెద్దవైనా, చిన్నవైనా గెలుపు, ఓటములను చాలామంది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందుకని ఎంపీ, ఎమ్మేల్యే ఎలక్షన్ మాత్రమే కాదు వార్డ్ మెంబర్, సర్పంచ్ ఎన్నికలకు కూడా గట్టి పోటీ ఉంటుంది. గెలిచినవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఓడినవాళ్లు నిరాశలో కూరుకుపోతారు.
అయితే.. హర్యానాలో ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రం సంతోషంగా ఉన్నాడు. అందుకు కారణం.. గ్రామస్తులంతా అతనికి ఎస్యూవీ కారుతో పాటు రూ. 2.11 కోట్ల నగదు బహుమతిగా ఇచ్చారు. రోహతక్ జిల్లాలోని చిరి గ్రామంలో జరిగింది ఈ వెరైటీ సంఘటన.
ధర్మపాల్ అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశాడు. నవంబర్ 12వ తేదీన వచ్చిన ఎలక్షన్ ఫలితాల్లో 66 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దాంతో బాధలో ఉన్న అతనికి ఊరు ఊరంతా అండగా నిలిచింది. అంతేకాదు గ్రామస్తులంతా కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ధర్మపాల్కి తలపాగా చుట్టి, మెడలో దండ వేశారు. అందరూ తలా కొన్ని డబ్బులు వేసి కారు కొనివ్వడమే కాకుండా రూ.2 కోట్లు కూడా ఇచ్చారు. ఓటమి భారంతో అతను కుంగిపోవద్దనే ఇదంతా చేశామని భలే రామ్ అనే ఖాప్ పంచాయతీ పెద్ద చెప్పాడు. ఈ ఫంక్షన్కు చుట్టుపక్కల గ్రామాల ఖాప్ పంచాయితీ పెద్దలు, ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తనపై ఊరివాళ్లంతా ప్రేమ కురిపించడంతో ధర్మపాల్ చాలా సంతోషించాడు.