న్యూయార్క్ : చిన్నారులకు మంచి పెంపకాన్ని అందిస్తే వారు ఎంతో పరిణితిని ప్రదర్శిస్తారని ఓ చిన్నారి రుజువు చేశారు. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించాలని తన చిన్న కొడుకుని ఓ తండ్రి కోరగా బుడతడి రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెస్టారెంట్లో మీల్స్ అనంతరం బిల్లు చెల్లించాలని చిన్నారిని తండ్రి కోరుతున్న వీడియోను డెరెక్లిప్ అనే ఇన్స్టాగ్రాం యూజర్ అప్లోడ్ చేశాడు.
తొలుత బిల్లును కొడుకు చేతికి అందించగానే చిన్నారి కొద్దిసేపు కన్ఫ్యూజ్ అవడంతో పాటు విచారంగా కనిపించాడు. ఆపై బిల్లును నువ్వే చెల్లించాలి..నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని తండ్రి అడగ్గా బాలుడు నిజాయితీతో కూడిన రియాక్షన్ ఇచ్చాడు. దీంతో బిగ్గరగా నవ్విన తండ్రి తాను జోక్ చేశానని చిన్నారితో చెప్పాడు. ఈ వీడియో ఇప్పటివరకూ 74 లక్షల వ్యూస్‌ను రాబట్టగా 2.98 లక్షల మంది లైక్ చేశారు. చిన్నారి రియాక్షన్‌కు ఫిదా అవుతూ వేయికి పైగా కామెంట్లు వచ్చాయి.
బిల్లు చెల్లించేందుకు బుడతడు అంగీకరించేలా రియాక్ట్ కావడం పట్ల పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం బిల్లు ఎలా చెల్లించాలా అనే ఆలోచనలు బుడతడి బుర్రలో కదలాడాయని ఓ యూజర్ కామెంట్ చేశాడు. డబ్బు లేకపోయినా బిల్లు చెల్లించేందుకు చిన్నారి చూపిన నిజాయితీ ఆకట్టుకుందని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, అందమైన హృదయం కలిగిన అందమైన బాలుడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.