IRCTC Shravan Special Tour | పవిత్ర శ్రావణ మాసంలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా శ్రావణ స్పెషల్ రామేశ్వరం-మదురై టూర్ ప్యాకేజీ (Shravan Special Rameshwaram Madurai Package)ని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా తమిళనాడులోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం, రామనాథ స్వామి దేవాలయం, ధనుష్కోటి, పంచముఖి హనుమాన్ ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించుకునే అవకాశం కల్పించింది.
ఈ స్పెషల్ ఆధ్యాత్మిక యాత్ర రెండు రాత్రులు, మూడు రోజుల పాటు కొనసాగేలా ఐఆర్సీటీసీ ప్యాకేజీని సిద్ధం చేసింది. భక్తులు తమ సౌకర్యానికి అనుగుణంగా మూడు వేర్వేరు తేదీల్లో ప్రయాణ తేదీలను ఎంచుకోవచ్చు. మొదటి టూర్ జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 2 వరకు, రెండో టూర్ ఆగస్టు 14 నుంచి 16 వరకు, మూడో టూర్ ఆగస్టు 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
ముంబై నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. మొదటి రోజు ఉదయం ముంబై నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నానికి మదురై చేరుకుంటారు. అక్కడ హోటల్లో బస ఏర్పాటు చేసిన తర్వాత సాయంత్రం ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఆలయ దర్శనం అనంతరం భక్తులకు భోజనం ఏర్పాటు చేస్తారు. రాత్రికి మదురైలోనే బస ఉంటుంది.
రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం రోడ్డు మార్గంలో మదురై నుంచి రామేశ్వం వెళ్తారు. అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత రామనాథస్వామి ఆలయం, ధనుష్కోటి, పంచుముఖి అనమాన్ ఆలయాలను సందర్శించారు. అనంతరం రామేశ్వరంలోనే రాత్రి భోజనం, బస కల్పిస్తారు.
మూడో రోజు ఉదయం బ్రేక్పాస్ట్ అనంతరం చెక్ అవుట్ చేసి మదురైకి వస్తారు. అక్కడి నుంచి రాత్రి విమానంలో ముంబైకి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఈ రామేశ్వరం, మదురై యాత్ర కోసం ఒంటరిగా ప్రయాణించే ఒక్కొక్కరి నుంచి రూ.33,910 వసూలు చేయాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరి నుంచి రూ.26,900, ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరి నుంచి రూ.26వేలు చార్జీ చేయనుంది. 5 నుంచి 11 సంవత్సరాల వయసు గల పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.23,300, బెడ్ లేకుండా అయితే రూ.20,200 చెల్లించాలి. అదే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల చిన్నారులకు రూ.18,100గా ప్యాకేజీ ధరను నిర్ణయించింది.
ఈ కంఫర్ట్ క్లాస్ ప్యాకేజీలో ముంబై-మదురై, మదురై-ముంబై విమాన టికెట్లు, త్రీస్టార్ హోటల్లో బస, స్థానిక దర్శనాల కోసం ఎయిర్ కండీషన్డ్ వాహన సదుపాయం, భోజనాలు, ప్రయాణ బీమా వంటి సదుపాయాలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. అయితే వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ సేవలు, గదికి ప్రత్యేకంగా ఆర్డర్ చేసే భోజనం, టిప్స్ వంటి ఖర్చులు ప్యాకేజీలో ఉండవని స్పష్టం చేసింది.
ఈ శ్రావణ మాస యాత్రలో పాల్గొనాలని అనుకునేవారు ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. శ్రావణ మాసంలో శైవ క్షేత్రాలను దర్శించుకోవాలని అనుకునే భక్తులకు ఈ ప్యాకేజీ మంచి అవకాశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.