హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): బెల్లంపల్లి గురుకులంలో ఇటీవల జరిగిన ఆహార కల్తీ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తక్షణం అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. బెల్లంపల్లిలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్పాయిజన్ జరిగింది. దాదాపు 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
వారిలో ఏడుగురి పరిస్థితి విషమించగా, ప్రస్తుతం మంచిర్యాల ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తునారు. ఈ ఘటనపై ‘బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్’ కథనం పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్పాయిజన్ ఘటనలను, అధికారుల నిర్లక్ష్యం తీరును వివరించింది. దీనిపై మానవహక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది.
విచారణను శనివారానికి వాయిదా వేసింది. ఫుడ్పాయిజన్ ఘటనపై బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి సైతం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, ఆహార నిల్వ విధానాలపై అధికారుల నిరంతర పర్యవేక్షణ కొరవడటం వల్లే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని వివరించారు. బాధ్యులైన వారిపై తక్షణమే సస్పెండ్ చేయడం తోపాటు, స్వతంత్రంగా ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు.